ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:36 AM
ఓటరు జాబితా ముసాయిదా పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు అధికారులు స్వీకరించనున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
మంథని, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మంథని మున్సిపాలిటీలో ప్రకటించిన ఓటరు లిస్టు జాబితా ముసాయిదా పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ఉన్న ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటించారు. అభ్యంతరాలను ఈనెల 9వ తేదీ వరకు అధికారులు స్వీకరించనున్నారు. ఓటరు జాబితా ముసాయిదాను పలు వార్డులకు చెందిన ఓటర్లు పరిశీలిస్తున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మనోహర్ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్‌లో విడుదల చేసిన ఓటరు ముసాయిదాపై వారు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించలేదని, ఒకే ఓటరుకు పలు వార్డుల్లో ఓటు హక్కు ఉందని, ఒకే వార్డుల్లో సైతం డబుల్ ఓటు హక్కు, ఒకే ఇంటి నెంబరు కల్గిన కుటుంబ సభ్యులను వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో కేటాయించారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో బీసీ ఓటర్ల జాబితా లేకుండా, కుల గణన సర్వే ప్రకారం బీసీల వివరాలు, కులాల గుర్తింపు లేకుండా జాబితా జారీ చేయడంపై న్యాయవాది ఇనుముల సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాల పై మున్సిపల్ కమిషనర్ మనోహర్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీల అభ్యంతరాలను, లిఖితపూర్వకంగా వచ్చిన వాటిపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సమావేశం నర్వహించారు. వార్డుల వారీగా ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పై, పోలింగ్ స్టేషన్ల పై అభిప్రాయాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ దాదాపుగా అన్ని వార్డుల పోలీస్‌స్టేషన్లు ఇదివరకు ఉన్న స్థానల్లోనే ఉంటాయని, ఎక్కువ ఓటర్లు వచ్చిన 11 వ వార్డులో అదనంగా ఒకటి ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు అనుగుణంగా 5వ పోలింగ్ స్టేషన్ ఇండియన్ మిషన్ సెకండరీ స్కూల్, 14వ వార్డును తెనుగువాడ ప్రభుత్వ పాఠశాలకు మార్చినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో 36 వార్డుల్లో మ్యాపింగ్ చేసిన 43845 ఓటర్లకు గాను 54 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించినట్లు తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, కిరణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 1న ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకొని డిలిమిటేషన్ లిస్టును సవరిస్తామని పేర్కొన్నారు. నాయకులతోపాటు అధికారులు మేనేజర్ అలీమోద్దిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.