Share News

సందడే.. సందడి

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:51 AM

మున్సిపల్‌ ఎన్నికలపై రోజుకో రకంగా ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్‌ వస్తోందని ఒకసారి, ఫిబ్రవరిలో పోలింగ్‌ ఉంటుందని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌, పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి.

సందడే.. సందడి

మున్సిపల్‌ ఎన్నికలపై రోజుకో రకంగా ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్‌ వస్తోందని ఒకసారి, ఫిబ్రవరిలో పోలింగ్‌ ఉంటుందని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌, పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓవైపు టికెట్ల కోసం పార్టీ నేతలను కలుస్తున్నారు. మరో వైపు ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

రిజర్వేషన్లతో ప్రణాళికలు తారుమారు

- కొత్త నేతల రాకతో ఆశావహుల ఆందోళన

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): డివిజన్ల రిజర్వేషన్లతో పలువురు ఆశావహులు, నాయకుల భవిష్యత్‌ తారుమారైంది. నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో ఒక డివిజన్‌ ఎస్టీకి, ఏడు డివిజన్లు ఎస్సీలకు, 25 డివిజన్లు బీసీలకు, మిగిలిన 33 డివిజన్లు అన్‌ రిజర్వ్‌ చేశారు. వీటిలో 33 డివిజన్లు మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు ఇతర డివిజన్ల నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో ఏ డివిజన్‌లో ఎవరు పోటీకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఆశావహుల కష్టాలు

చాలా కాలంగా మున్సిపల్‌ ఎన్నికల కోసం ఎదురుచూస్తూ డివిజన్లలో ప్రజలతో మమేకమై పోటీకి సిద్ధమవుతున్న నాయకులు, ఆశావహులు కొత్త నేతల రాకతో బెంబేలెత్తుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, ఫిబ్రవరి రెండవ వారంలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో ఆశావహులు టికెట్ల కోసం ఓవైపు, ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు మరోవైపు తెల్లవారు జామున నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పోటీలో ఉంటున్నానని, ఆశీర్వదించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు టికెట్‌ ఇస్తారో లేక పారా చూట్‌ నాయకులకు అప్పగిస్తారో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వకుంటే పార్టీ మారి వేరొక పార్టీ నుంచి టికెట్‌ తెచ్చుకుని బరిలో నిలిచేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే మరికొందరు స్వతంత్రులుగా పోటీచేస్తే గెలుస్తామా లేదా లేక పోటీ నుంచి తప్పుకోవడమా అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రిజర్వేషన్లు తమ తలరాతను మార్చేశాయని, చాలా కాలంగా డివిజన్లలో ప్రచారం చేసుకుని గెలుపు ధీమాతో ఉన్న తమకు అవకాశమే లేకుండా పోయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర డివిజన్లనుంచి వచ్చే నాయకులు టికెట్ల కేటాయింపులో ప్రభావం చూపుతారని మరికొందరు, మహిళా డివిజన్లలో వారి భార్యలను లేదా తల్లులను లేదా ఇతర కుటుంబ సభ్యులను కొందరు బరిలో నిలుపుతున్నప్పటికి ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ కండువాలను మార్చుకోగా మరికొందరు పార్టీలను మారేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రోజురోజుకు నగరంలో రాజకీయం వేడెక్కుతోంది.

అందరి చూపు.. అభ్యర్థుల వైపు..

- హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో జోరుగా చర్చ

హుజూరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి చైర్మన్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఆయా పార్టీల్లో దళిత సామాజిక వర్గంలో ఉన్న పలువురు నాయకులు చైర్మన్‌ కోసం బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న హుజూరాబాద్‌ 2011లో పురుపాలక సంఘంగా ఏర్పడింది. ఆ తర్వాత 2019లో మున్సిపాలిటీగా మారింది. వడ్లూరి విజయ్‌కుమార్‌ బీసీ జనరల్‌ రిజర్వేషన్‌లో చైర్మన్‌ కాగా మధ్యలోనే అవిశ్వాస తీర్మాణంతో మంద ఉమాదేవి చైర్మన్‌ అయ్యారు. 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గందె రాధిక జనరల్‌ మహిళ రిజర్వేషన్‌లో చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. చాలా మంది ఈ సారి జనరల్‌ లేదా, బీసీకి రిజర్వు అవుతుందనే ఆశపడ్డారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్‌ ఎస్సీ మహిళకు వచ్చింది. అన్ని పార్టీల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్‌ అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు. వారం రోజుల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తలకిందులైన వార్డుల రిజర్వేషన్లు...

హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డులు ఉండగా, గతంలో ఉన్న రిజర్వేషన్లు ఈ సారి మారడంతో తాజా మాజీలు వేరే చోట పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా పోటీలో ఉండాలనుకుంటున్న నాయకులు తమకు అనుకూలమైన వార్డు ఏదైతే బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులోకి వెళ్లి పోటీ చేస్తే గెలవగలం అనే అంచనాల్లో తలమునకలయ్యారు. ఆ వార్డులకు చెందిన ప్రధాన నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

గరంగరంగా జమ్మికుంట రాజకీయం..

జమ్మికుంట: జమ్మికుంటలో మున్సిపల్‌ రాజకీయం వేడెక్కింది. చైర్మన్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు అభ్యర్ధులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వార్డుల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. రేపో, మాపో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో మంచి గుర్తింపు ఉండి ఆర్ధికంగా బలంగా ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు కమిటీలు ఏర్పాటు చేశాయి. గెలుపు అవకాశాలు, ఆర్ధిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోని ఈ కమిటీలు అభ్యర్ధులను ప్రాథమికంగా ఖరారు చేయనున్నాయి.

నిధుల సమీకరణ

ఎన్నికల ఖర్చు కోసం ఆశావహులు నిధులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. బంధువుల వద్ద చేబదులు, తెలిసినవారి వద్ద అప్పు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆస్తులు అమ్మయినా, తాకట్టుపెట్టయినా ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి ఆశావాహులు టికెట్ల వేటలో పడ్డారు. ఆయా పార్టీల శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను కలుస్తున్నారు.

చైర్మన్‌ పీఠం కోసం పోటాపోటీ

జమ్మికుంట రూరల్‌: జమ్మికుంట మున్సిపాల్టీలో చైర్మన్‌ కుర్చీ కోసం ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్సీ జనరల్‌కి రిజర్వ్‌డ్‌ అయింది. మున్సిపాల్టీలో 30 వార్డుల్లో మూడు ఎస్సీ మహిళా, మూడు ఎస్సీ జనరల్‌ స్థానాలు ఉన్నాయి. ఈ వార్డుల్లో తమకు అనుకూలత ఉంటుందా.. లేదా అన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపి మూడు ప్రధాన పార్టీల్లో చైర్మన్‌ పీఠం ఆశీస్తున్న అభ్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు. జమ్మికుంట మున్సిపాల్టీలో మూడు ఎస్సీ జనరల్‌, ఆరు జనరల్‌ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలపై అన్ని పార్టీల ఆశావహులు దృష్టి సారించారు. ఎస్సీ జనరల్‌లో వీలు కాకపోతే జనరల్‌ స్థానంలో పోటీ చేసి విజయం సాధించి చైర్మన్‌ రేసులో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:51 AM