Share News

వరి వద్దు..

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:52 PM

యాసంగి సాగులో పంటల సరళి మారనుంది. నీటి లభ్యతపై అనిశ్చితి, భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులు, సాగునీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి సారించింది.

వరి వద్దు..

పెద్దపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): యాసంగి సాగులో పంటల సరళి మారనుంది. నీటి లభ్యతపై అనిశ్చితి, భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులు, సాగునీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తోంది. జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో రైతులకు వివరించడంతో పాటు సోషల్‌ మీడియాను ప్రచార సాధనంగా వినియోగిస్తోంది. గ్రామస్థాయి వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, సమాచార సందేశాలను షేర్‌ చేస్తూ వరి సాగుతో ఎదురయ్యే నీటి సమస్యలను వివరిస్తోంది. సాగునీటి కొరత ఏర్పడితే చివరి దశలో పంటకు నీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు తగ్గితే తదుపరి పంటలపైనా ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.

మూడు కేటగిరీల్లో పంటల ప్రణాళిక

నీటి లభ్యతను ఆధారంగా రైతులను మూడు కేటగిరీలుగా విభజించి పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. మొదటి కేటగిరీలో తక్కువ నీటితో పండే శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జ వంటి పంటలను సూచిస్తున్నారు. రెండో కేటగిరీలో మధ్యస్థ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వుల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. మూడో కేటగిరీలో పుష్కలంగా నీటి వసతి, మార్కెట్‌ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు.

ఫ 1.53 లక్షల ఎకరాల్లోనే సాగు అంచనా!

జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారం 2026-27 యాసంగిలో జిల్లాలో సుమారు 1,53,586 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశ ముంది. నీటి కొరత కారణంగా మరో 90,015 ఎకరాలు బీడుగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబరులో సాధారణంగా 75.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా చినుకు కూడా పడకపోవడం, జూన్‌ నుంచి అక్టోబరు వరకు సాధారణం కంటే 8 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 5.31 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

గత యాసంగి సాగుతో పోలిస్తే..

2024-25 యాసంగి సాగు వివరాల ప్రకారం మొత్తం 2,10,931 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 1,95,712ఎకరాలు కాగా, మొక్కజొన్న 15,080 ఎకరాలు. నువ్వులు 120 ఎకరాలు, వేరుశనగ 12 ఎకరాలు, శనగ 7ఎకరాల్లో సాగయ్యాయి. గత యాసంగి సాగులో వరి ప్రధాన పంటగా ఉండగా, ఈసారి ఎల్‌నినో ప్రభావం తో పంటల మార్పు దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది.

రైతులకు అవగాహన.. క్షేత్రస్థాయిలో ప్రచారం

రైతులు వరి సాగుకు సిద్ధమయ్యేలోపే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఏఈవోలు, ఏఓలు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించడం, రైతు వేదికల ద్వారా సాగు విధానాలను వివరించడం, వాట్సాప్‌ గ్రూపుల్లో వీడియోలు పంపించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం పంట మార్పు సూచించడమే కాకుండా ఏ నేలలో ఎలాంటి పంటలు సాగు చేయాలో వివరిస్తున్నారు. భవిష్యత్తులో సాగునీటి కొరత ఉండనున్న నేపథ్యంలో అతి తక్కువ నీటి తడులతో సాగయ్యే వాటినే సూచిస్తున్నారు. మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు సైతం తాము పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో ఆరుతడి పంటల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నారు. అధికారులు, వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిపుణుల సూచనలు పాటిస్తూ ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

రైతుల్లోనూ సందిగ్ధత!

ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నప్పటికీ రైతుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. వరి సాగుపై ఉన్న అనుభవం, ధాన్యం కొనుగోళ్లకు ఉన్న మార్కెట్‌ వ్యవస్థ ఇతర పంటలకు అంతగా అందు బాటులో లేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేస్తే వాటికి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, శనగ, వేరుశనగ, కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు సకాలంలో అం దించడంతోపాటు, పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్‌ సదుపాయం కల్పిస్తేనే రైతులు పంట మార్పునకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కాపాడుకోవడమే కాకుండా రైతు పెట్టుబడికి భరోసా కల్పించడం కూడా యాసంగి ప్రణాళికలో కీలకంగా మారనుంది.

Updated Date - Nov 14 , 2026 | 11:52 PM