Share News

చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు

ABN , Publish Date - May 24 , 2026 | 12:00 AM

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్‌ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.

చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు

కోల్‌సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్‌ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ముస్లిం, హిందు, క్రిస్టియన్‌ మత పెద్దలతో పోలీసుల శాంతి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ సమాజంలో మత సామరస్యం, ఐక్యతతో అన్ని వర్గాల ప్రజలు ఒకరి మత విశ్వాసా లను మరొకరు గౌరవిస్తూ సోదరభావంతో బక్రీద్‌ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పశువులను తరలించే వాహనాలను అడ్డుకోవడం వ్యక్తులపై దాడులు చేయడం బలవంతంగా తనిఖీలు చేయడం చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా అనుమానాస్పద వాహనాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వదంతులు వ్యాప్తిచెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్‌ చేయవద్దని తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన నిర్ణీత ప్రదేశాల్లోనే జంతువధ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలను పారవేయకుండా, పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌, మనోహర్‌, అనూష, హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:00 AM