Share News

సూదుల్లేవు.. మందుల్లేవు

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:58 AM

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశాలున్నాయి.. ఇందుకోసం పేద ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో మాత్రం సిరంజీలు, మందుల కొరత ఏర్పడింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి సిరంజీల సరఫరా నిలిచిపోయింది.

సూదుల్లేవు.. మందుల్లేవు

హుజూరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశాలున్నాయి.. ఇందుకోసం పేద ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో మాత్రం సిరంజీలు, మందుల కొరత ఏర్పడింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ నుంచి సిరంజీల సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులే సిరంజీలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా వాతావరణ మార్పులు వచ్చాయి. చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లితే సిరంజీలు, మందుల కొరత నెలకొంది. ప్రతీరోజు హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి వందలాది మంది రోగులు వస్తుంటారు. గుండె, కడుపు మంట, తీవ్ర రక్తస్రావానికి సంబంధించిన మందులు రావడం లేదు. దీంతో ప్రజలే ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిరంజీలు, మందుల కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

సిబ్బంది కొరత

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో కొంత కాలంగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ ఆస్పత్రికి చుట్టుపక్కల మండలాల నుంచి రోగులు ఎక్కువగా వస్తుంటారు. సిబ్బందిని భర్తీ చేయాలని ఎన్నోసార్లు నివేదికలు పంపించినా పట్టించుకోవడం లేదు. వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆస్పత్రి వచ్చే ప్రజలు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా ఆస్పత్రిలో నలుగురు సివిల్‌ సర్జన్లకు ముగ్గురు ఉండగా ఒకరు పోస్టు, డిప్యూటీ సివిల్‌ సర్జన్లు ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స తొమ్మిది , స్టాప్‌ నర్సులు ఏడు, ల్యాబ్‌ టెక్నీషియన, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-1, ఫిజియోథెరపిస్టు, ఏఎనఎం ఒక్కొక్కటి, జూనియర్‌ అసిస్టెంట్స్‌ రెండు, ల్యాబ్‌ అటెండర్స్‌ రెండు, డెలివరీ నర్సుల పోస్టులు రెండు ఖాళీ ఉన్నాయి. ఆస్పత్రిలో చాలా మంది ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇతర ప్రాంతాలకు రెఫర్‌

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షించి ఇతర ప్రాంతాలకు రెఫర్లు చేస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, జమ్మికుంట రహదారుల వెంట తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. చిన్న గాయాలతో ఆస్పత్రికి వస్తే వైద్య సేవలు అందించాల్సింది పోయి రోగులను భయాబ్రాంతులకు గురి చేసి వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లాలని సూచిస్తున్నారని పలువురు అంటున్నారు. రోగి ఆస్పత్రిలో ఉంటే సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వైద్య సిబ్బంది ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని డివిజన వాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:58 AM