Share News

రామగుండంలో ఇక కూల్చివేతలు లేవు... కట్టడాలే

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:12 AM

రామగుండానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వ్యాపార, విద్య, వైద్య పరంగా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని రామగుండంలో ఇక కూల్చివేతలు ఉండబోవని కట్టడాలే ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు.

రామగుండంలో ఇక కూల్చివేతలు లేవు... కట్టడాలే

కోల్‌సిటీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రామగుండానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వ్యాపార, విద్య, వైద్య పరంగా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని రామగుండంలో ఇక కూల్చివేతలు ఉండబోవని కట్టడాలే ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆదివారం లక్ష్మీనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామగుండంలో ఓపెన్‌కాస్ట్‌ తీసుకువచ్చి ఈప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారని, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితులు తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లతో నగర అబివృద్ధి చేపట్టామని, రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా ఎస్టీపీల నిర్మాణం జరుపుతున్నామన్నారు. రూ.100 కోట్లతో నిరంతరా యంగా నీటి సరఫరాకు ఏర్పాటు చేస్తున్నామని, సమ్మక్క సారలమ్మ జాతరలను అత్యధిక నిధులు వెచ్చించి కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించామని మక్కాన్‌సింగ్‌ తెలిపారు. రామగుండాన్ని వ్యాపార పరంగా అభివృద్ధి చేసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో రూ. 60 కోట్లతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేలా ఒప్పించామని, సింగరేణి పాత క్వార్టర్లు తొలగించి వాటి స్థానంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని ఎమ్మెల్యే తెలిపారు. లక్ష్మీనగర్‌ వ్యాపార కేంద్రాన్ని రూ. 50 కోట్లతో అభివృద్ధి చేశామని, విద్యుత్‌ స్తంభాలను మార్చాలని వ్యాపారులు కోరారని, వారి కోరిక మేరకు చేస్తామన్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయి స్తామని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే జనాభా 5లక్షలకు చేరుతుందని, తద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మక్కాన్‌సింగ్‌ ప్రజలను కోరారు. మహాలక్ష్మి, గోపాల్‌ రావు, క్యాస శ్రీనివాస్‌, స్వప్న ఆనంద్‌, స్వామి, అశోక్‌రావు, కాల్వ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:12 AM