సాగు భూములు ఇచ్చేది లేదు
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:30 AM
ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములు ఇచ్చేది లేదని దర్యాపూర్ బాధిత రైతులు పేర్కొన్నారు. శనివారం దర్యాపూర్ శివారులో రెవెన్యూ అధికారులు 144, 145 గల సర్వే నెంబర్లలో ఎక్స్‌కవేటర్‌తో ట్రెంచ్ పనులు చేయించేందుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు.
ముత్తారం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములు ఇచ్చేది లేదని దర్యాపూర్ బాధిత రైతులు పేర్కొన్నారు. శనివారం దర్యాపూర్ శివారులో రెవెన్యూ అధికారులు 144, 145 గల సర్వే నెంబర్లలో ఎక్స్‌కవేటర్‌తో ట్రెంచ్ పనులు చేయించేందుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదని పెట్రోల్ సీసాలు, పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో అధికారులు పనులు నిలిపివేశారు. స్థానిక రైతులు మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి భూములను సాగు చేసుకొని జీవిస్తున్నామన్నారు. తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిపై పూర్తి సర్వే జరిపి సాగులో ఉన్న తమకు హక్కులు కల్పిం చాలన్నారు. సుమారు 200 ఎకరాల భూమి దేని కోసం స్వాధీనం చేసుకుంటున్నారో, ట్రెంచ్ కొడుతున్నారో కాగితాలు చూపించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్తే ఆర్డీవో, కలెక్టర్ ఆఫీస్‌కు తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ భూములను లాక్కుంటే రోడ్డున పడతామని, ప్రభుత్వం స్పందించి సాగు భూములు తమకే ఉంచాలని వేడుకున్నారు.