ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరుబాట
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:25 PM
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం పోరుబాట పట్టారు. వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం పోరుబాట పట్టారు. వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, తగిన గుర్తింపు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉద్యోగులు, సుమారు 178 రకాల కేడర్లలో పనిచేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట 11 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వారు పేర్కొంటున్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల కీలకపాత్ర
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర కీలకం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, వ్యాధుల నియంత్రణ, ప్రయోగశాల పరీక్షలు, మందుల పంపిణీ, ప్రాథమిక వైద్య సేవలు, ఆరోగ్య పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాల్లో వీరు సేవలందిస్తున్నారు. వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బందితోపాటు కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది ఇలా విభిన్న విభాగాల ఉద్యోగులు ఇందులో భాగస్వాములవుతున్నారు. అత్యవసర పరిస్థితులు, అంటువ్యాధుల నియంత్రణ, ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాల సమయంలోనూ సేవలందిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తున్న ఆర్థిక భరోసా, ఉద్యోగ భద్రత కొరవడ్డాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రమబద్దీకరణకు ఎదురుచూపులు
ఎన్హెచ్ఎంలో సుమారు ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, వేతనాల్లో పెరుగుదల లేకపోవడం, పదోన్నతులు, ఇతర ప్రయోజనాల విషయంలో అనిశ్చితి కొనసాగడం ఆందోళనకు గురిచేస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగులు, ఎన్హెచ్ఎం కాంట్రాక్టు ఉద్యోగులు ఒకే రకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా వేతనాలు, అలవెన్సుల్లో వ్యత్యాసాలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నిస్తున్నారు.
కుటుంబ పోషణ భారంగా మారింది....
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల నేపథ్యంలో పరిమిత వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. తగిన వేతన సవరణలు చేపట్టాలని, అన్ని కేడర్ల సమస్యలను సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు. వైద్య సిబ్బందితో పాటు పరిపాలనా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ భద్రత, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సమీక్షించడం, అర్హతలు, బాధ్యతలు, సేవాకాలాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తాం
- ఎన్హెచ్ఎం జెఏసీ జిల్లా అధ్యక్షుడు మహేందర్
తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13 నుంచి ఆందోళనలు చేస్తున్నాం. మానవతా దృక్పథంతో ఉద్యోగుల్లో కొందరిని జిల్లాలోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవల విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నాం. కానీ ప్రభుత్వం తమ ఆందోళన, డిమాండ్లను పరిష్కరించడంలో స్పందించడం లేదు. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేసి జిల్లాలో ఉన్న 500 మంది ఉద్యోగులంతా ఆందోళన చేస్తాం.