కొత్తగా ‘చేయూత’ 14,834 మందికి..
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:29 AM
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త చేయూత పింఛన్లు లబ్ధిదారులకు అందనున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న కొత్తగా గుర్తించిన లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమకానున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల కొత్త పింఛన్ల పంపిణీని దీపావళి పర్వదినం సందర్భంగా ఈనెల 8న లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన 14,834 మందికి కొత్త పెన్షన్లు అందనున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)

సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరణ
కొత్త పింఛన్ల కోసం సెప్టెంబరులో దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలోని 15 మండలాల్లో 16,334, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, కరీంనగర్ కార్పొరేషన్‌లో 8,300 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రెండేసి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలోని ఒక దరఖాస్తును, అలాగే అర్హత లేనివారి దరఖాస్తులను తొలగించి 14,834 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మండలాల్లో 9,476 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు కాగా కరీంనగర్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల పరిధిలో 5,358 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. 7,050 మందికి వితంతు, 4,006 మందికి దివ్యాంగుల పెన్షన్లు లభించనున్నాయి. 1.503 మందికి గీత కార్మికుల పెన్షన్, 379 మందికి చేనేత కార్మిక పెన్షన్, 1327 మందికి ఒంటరి మహిళా పింఛన్లు మంజూరయ్యాయి.
జిల్లావ్యాప్తంగా.. పింఛన్లు ఇలా..
కరీంనగర్ కార్పొరేషన్‌లో 3,812 మందికి, జమ్మికుంట మున్సిపాలిటీలో 589 మందికి, హుజురాబాద్ మున్సిపాలిటీలో 540, చొప్పదండి మున్సిపాలిటీలో 424 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. చిగురుమామిడి మండలంలో 550, చొప్పదండిలో 490, ఇల్లందకుంటలో 428, గంగాధరలో 897, గన్నేరువరంలో 364, హుజురాబాద్‌లో 603, జమ్మికుంటలో 553, కరీంనగర్ రూరల్‌లో 477, కొత్తపల్లిలో 353, మానకొండూరులో 1,402, రామడుగులో 734, సైదాపూర్‌లో 642, శంకరపట్నంలో 648, తిమ్మాపూర్‌లో 690, వీణవంక మండలంలో 645 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో జిల్లాలో కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంచార్జి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేస్తారు. 19న వారివారి ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమచేస్తారు. దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున మిగిలిన ఇతర పెన్షన్ లబ్ధిదారులకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్ లభించనున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున, ఇతరులకు 4,016 చొప్పున నెలనెలా పెన్షన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. హామీ మేరకు పాత, కొత్త పింఛనుదారులందరికి పెన్షన్ డబ్బులు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.