వాల్టా చట్టం ఉల్లంఘనపై నజర్
ABN , Publish Date - May 10 , 2026 | 12:43 AM
వాల్టా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక నుంచి కొత్త బోర్లు వేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. వేసవి నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతుండగా, మరోవైపు గ్రామాలు, పట్టణాలలో గృహ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు.
జగిత్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): వాల్టా చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇక నుంచి కొత్త బోర్లు వేయాలంటే అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటారు. వేసవి నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతుండగా, మరోవైపు గ్రామాలు, పట్టణాలలో గృహ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు ఎత్తిపోతుండడంతో రైతులు కొత్త బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ నేతృత్వంలో రెవెన్యూ, మున్సిపల్, భూగర్భ జల శాఖల అధికారులు వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి పూనుకున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో సైతం వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఇష్టారీతిన బోర్లు..
జిల్లాలో పలువురు ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు జరుపుతున్నారు. నీటిని అవసరాలకు మించి వాడుతుండడం... అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్లు వేయడం వంటివి భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తున్నప్పటికీ పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. భూగర్బ జలాలను కాపాడుకోవడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002లో నీరు, భూమి, వృక్షాల ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చింది.
వాల్టా చట్టంలోని నిబంధనలు..
నీరు, భూమి, వృక్షాల సంరక్షణకు రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది. వాటర్ ల్యాండ్ ట్రీస్ ఆక్ట్ (వాల్టా)గా రూపొందించిన చట్టాన్ని పట్టించుకోవడం లేదు. ఈ చట్టంలో బోరు బావులకు సంబంధించిన అనేక నిబంధనలను పొందుపరిచారు. ఎవరైనా బోరు బావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. సర్వే నంబరు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తదుపరి ఆ అప్లికేషన్‌ను భూగర్భ జల వనరుల శాఖకు పంపుతారు. అక్కడి టెక్నికల్ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతంలో నీరు పడుతాయని ధ్రువీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అనుమతినిస్తారు. ఒకవేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూడ్చివేయాలి. ఇంత పకడ్బందీగా వాల్టా చట్టం రూపొందించినప్పటికీ చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇంట్లో వేసుకునే బోర్లకు సైతం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
భూగర్భ జల శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
బోరు బావులు తవ్వాలంటే భూగర్భ జల శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. బోరు బావులు కూడా విధిగా భూగర్బ జల శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనుమతి లేకుండా బోర్లు వేస్తే భారీ జరిమానాలు విధిస్తారు. భూగర్భ జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు, వ్యవసాయ క్షేత్రంలో పామ్‌పాండ్‌లు నిర్మించికోవాలి. జిల్లాలోని అన్ని పరిశ్రమలు, వాణిజ్యపరంగా భూగర్భ జలాలను ఉపయోగించే పెట్రోలు బంకులు, స్కూళ్లు, హోటళ్లు, హాస్పిటళ్ల నిర్వాహకులు వాల్టా చట్టం ప్రకారం అనుమతి పొందాల్సి ఉంటుంది. లేనియెడల నిబంధనల ప్రకరాం చర్యలు తీసుకుంటారు.
నిబంధనలు గాలికి...
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. ఎడా పెడా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు పడితున్నాయి. నీళ్ల వాడకం, చెట్లను కాపాడుకోవడానికి తీసుకువచ్చిన చట్టాన్ని నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందే సంబందిత ప్రాంతంలో వంద మీటర్ల దూరం వరకు బోర్లు వేసి ఉంటే ఆ ప్రాంతంలో మళ్లీ బోర్లు తవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వరు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.30 లక్షల బోరు బావులు, బావులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు బోర్ల తవ్వకాలపై రికార్డులను సరిచూడాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 380 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాల్టీలు ఉన్నాయి. జిల్లాలో 509 గ్రామ పంచాయతీ చెరువుల కింద 3,130 హెక్టార్ల నీటి విస్తీర్ణం, 185 మత్స్య శాఖ చెరువుల కింద 15,162 హెక్టార్ల నీటి విస్తీర్ణం ఉంది. జిల్లాలో బోరు బావులు, బావుల కోసం సుమారు 1.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 2,645 కిలోమీటర్ల భూగర్భ విస్తీర్ణం ఉంది. జిల్లాలో రోజుకు సుమారు 100 నుంచి 150 వరకు కొత్త బోర్లు వేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1.80 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. గృహ బోరు కనెక్షన్లు సుమారు 6.50 లక్షల వరకు ఉన్నాయి. కొత్తగా ఇళ్లను నిర్మించుకునే వారు బోరు వేయడం తప్పనిసరిగా మారింది. ఇష్టానుసారం ఒక్కో బోరును 500 నుంచి 900 మీటర్ల వరకు తవ్విస్తున్నారు. తద్వారా భూమిలోని పొరలు పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత కూడా తగ్గిపోతుంది. వీటిని నివారించడానికి వాల్టా నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షణ...
గ్రామాల్లో బోర్లు వేస్తే తహసీల్ధార్, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలనే నిబంధనల తప్పనిసరి చేయాలని చూస్తున్నారు. నిబంధనలు పాటించకుండా బోర్లు వేస్తే సీజ్ చేయడం లేదా జరిమానా విధిస్తామని జిల్లా స్థాయి కమిటీ సభ్యులు అంటున్నారు. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా ఉండగా, కన్వీనర్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, సభ్యులుగా భూగర్భ జల శాఖ అధికారి, మిషన్ భగీరథ ఎస్‌ఈ, పబ్లిక్ హెల్త్ ఈఈ, ఇరిగేషన్ ఈఈ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారు. ఈ కమిటీ వాల్టా చట్టాన్ని అమలు అయ్యే విధంగా చూస్తుంది.
భూగర్భ జలాలను కాపాడుకోవాలి
శ్రీకాంత్, జిల్లా భూగర్భ జల శాఖాధికారి
వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత మండలాల తహసీల్దార్లదే. ఆయా మండలాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రెవెన్యూ అధికారులు భూగర్భ జల శాఖకు పంపే వాటిని మాత్రమే టెక్నికల్ అంశాల ఆధారంగా పరిశీలిసాం. ఇందుకు సంబంధించి రెవెన్యూ కార్యాలయాల్లో ప్రత్యేక రికార్డులుండాలి. అంతంతమాత్రంగానే దరఖాస్తులు వస్తున్నాయి. ప్రతీ ఒక్క బోరు బావి తవ్వకానికి అనుమతి తీసుకోవాలి. భూగర్భ జలాలను కాపాడుకుంతేనే నీటి సమస్య తలెత్తదు.