Share News

వసతుల కల్పనపై నజర్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:06 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచితంగా కాలేజీ బ్యాగులు, బ్రాండెడ్‌ షూస్‌, సాక్సులు అందించే కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.

వసతుల కల్పనపై నజర్‌

జగిత్యాల, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచితంగా కాలేజీ బ్యాగులు, బ్రాండెడ్‌ షూస్‌, సాక్సులు అందించే కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కుల పంపిణీ పూర్తికాగా ప్రస్తుతం విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి పంపిణీపై అధికారులు దృష్టి సారించారు.

ఫజిల్లాలో 16 ప్రభుత్వ కళాశాలలు

జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 5,388 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 3,200 మంది బాలురు, 2,188 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సామగ్రి, షూస్‌ తదితర వస్తువులు అందనున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు స్కూల్‌ బ్యాగులు, షూస్‌, సాక్సులు పంపిణీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో టై, బెల్టులు సైతం పంపిణీ చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సాధ్యమైనంత తొందరలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది.

ఫతల్లిదండ్రులపై తగ్గనున్న ఆర్థికభారం

పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగులు, షూస్‌, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది భారంగా మారేది. ఇప్పుడు ప్రభుత్వం అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తుండడంతో కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతోంది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చదువుకునే కుటుంబాలకు ఈ పథకం మరింత ఉపశమనం కలిగించనుంది.

ఫప్రభుత్వ కాలేజీల వైపు అడుగులు...

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, విద్యా సామగ్రి అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇప్పటి వరకు కార్పొరేట్‌ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలను కూడా ప్రత్యా మ్నాయంగా పరిశీలించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ప్రవేశాలు పెరగడమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఫడ్రాపౌట్‌లకు అడ్డుకట్ట

పదో తరగతి అనంతరం ఆర్థిక ఇబ్బందులు, చదువు ఖర్చుల కారణంగా కొందరు విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరకుండా చదువుకు దూరమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగులు, షూస్‌ వంటి అవసరమైన వస్తువులను అందించడం ద్వారా విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు. దీంతో డ్రాపౌట్‌ల సంఖ్య తగ్గే అవకాశముందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కిట్‌ పథకం ద్వారా జిల్లాలోని వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నాయి.

పకడ్బందీగా అమలు చేస్తున్నాం

-రమేశ్‌ బాబు, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులందరికీ స్కూల్‌ బ్యాగులు, షూస్‌ పకడ్బందీగా పంపిణీ చేస్తున్నాం. గత నెలలో పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు పంపిణీ చేశాం. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో బ్యాగులు, షూస్‌ పంపిణీ చేస్తున్నాం. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తున్నాం.

Updated Date - Sep 06 , 2026 | 01:06 AM