మూగబోయిన మైకులు
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:41 AM
మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి.. ఇన్నాళ్లు ప్రచార హోరుతో దద్దరిల్లిన వీధులన్నీ ఒక్కసారి సైలెంట్ అయ్యాయి.
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి.. ఇన్నాళ్లు ప్రచార హోరుతో దద్దరిల్లిన వీధులన్నీ ఒక్కసారి సైలెంట్ అయ్యాయి. నిన్నమొన్నటి వరకు కిక్కిరిసి సందడిగా ఉన్న అభ్యర్థుల ఇళ్లు, పార్టీ, ప్రచార కార్యాలయాలు కొంతమంది కార్యకర్తలకే పరిమితమయ్యాయి. సెల్‌ఫోన్లు, టీవీల్లో వచ్చిన ఓటు వేయాలంటూ వచ్చిన మాడ్ మెస్సేజీలు, వాయిస్ కాల్స్ నిలిచి పోయాయి. వారంరోజులుగా ప్రచారాలతో విసిగి పోయిన ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు ఆఖరి రోజు చివరి సమయం వరకు ప్రజాబలం చూపించేందుకు పోటాపోటీగా ర్యాలీలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, వివిధ సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
సమావేశాలు, విందులు
ఎన్నికలకు 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ సమయాన్ని వినియోగించుకొని ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే సంఘాలు, సమావేశాలను ఏర్పాటు చేసి విందులు, భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి గెలిచిన తర్వాత అది చేస్తాం... ఇది చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఇప్పుడు అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసి ఓటు వేయించుకునేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు ఆ పార్టీ వస్తుందని, వాటిని తీసుకొని తమకు ఓటు వేయాలని అంటున్నారు. ఓవైపు ప్రత్యర్థి అభ్యర్థులు పంపిణీ చేయకుండా, మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా వారు మాత్రమే పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
‘పంపిణీ’ ప్రారంభం
ఆదివారం సాయంత్రం నుంచే ‘పంపిణీ’ కార్యక్రమానికి కార్యాచరణను అమలులోకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ పకడ్బందీగా నిఘా ఏర్పాట్లు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఆయా రంగాలకు చెందిన నిఘా అధికారులు క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, వారి అనునాయులు, పార్టీ కార్యాలయాలు ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టి కాపు కాస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటర్లకు ఆ పార్టీ 500 ఇస్తుందని, ఈ పార్టీ ఓటుకు వేయి నుంచి రెండు వేలు ఇస్తుందని, కొన్ని చోట్ల ఓటుకు ఐదు వేల వరకు ఇస్తున్నట్లు గ్యాసిప్స్ రావడంతో వాటిపైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంతోపాటు ప్రతి అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తింది. ఇక ప్రచారం ముగియడంతో ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరెవరెరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో, ఓటరు దేవుడు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నేతృత్వంలో కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 477 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలతోపాటు పోలింగ్ సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
------------