ప్రాణహిత బ్యారేజీపై కదలిక..
ABN , Publish Date - May 02 , 2026 | 11:40 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత నదిపై చేపట్టాల్సిన బ్యారేజీ నిర్మాణంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి పెద్దపల్లి జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వా యర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవు తున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత నదిపై చేపట్టాల్సిన బ్యారేజీ నిర్మాణంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి పెద్దపల్లి జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వా యర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవు తున్నది. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఒప్పించి కేంద్రం నుంచి సీడబ్ల్యూసీ, పర్యావరణ అనుమతులు సాధించి శరవేగంగా బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించడంతోపాటు ఎత్తిపో తల ఖర్చు లేకుండా జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని నిరంతరాయంగా తరలించవచ్చని భావిస్తున్నారు. అనతి కాలంలోనే మరమ్మతులకు వచ్చిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మర మ్మతులు పూర్తి చేసి వాటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా వినియోగించు కోవాలని చూస్తున్నారు. అవసరాన్ని బట్టి నీటిని ఎత్తిపోసుకోనున్నారు.
71 కిలోమీటర్ల వరకు కాలువలు పూర్తి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు భూము లకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు 38,500 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి సముద్రమట్టానికి 148 అడుగుల ఎత్తున జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు కాలువల ద్వారా నీటిని తరలించేందుకు కాలువ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71 కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించి లైనింగ్ కూడా పూర్తి చేశారు. ఇందుకోసం 1500 కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం దిగువన గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించారు. దానికి ఎగువన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించి రివర్స్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లను నిర్మిం చారు. దీంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్టు 23న కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ బ్యారేజీ నిర్మాణం చేపట్టలేదు. కాళేశ్వరం బ్యారేజీలను శరవేగంగా నిర్మించి 2020 నుంచి నీటిని ఎత్తిపోయడం ఆరంభించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి పోవడం, ఆ తర్వాత అన్నారం బ్యారేజీకి బుంగ పడడం, సుందిళ్ల బ్యారేజీ మరమ్మతుకు రావడంతో ఎత్తిపోతలను నిలిపివేశారు. అదే ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకూ రెండేళ్ల తర్వాత ప్రాణహితపై బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
రెండేళ్లుగా ఎత్తిపోతలు బంద్..
కాళేశ్వరం బ్యారేజీలు మరమ్మతులకు రావడంతో వాటిలో ప్రభుత్వం నీటిని నిల్వ చేయకుండా రెండేళ్లుగా ఓపెన్ ఫ్రీ బ్యారేజీలుగానే వదిలి వేసింది. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతుండడంతో కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఎత్తిపోతలు అవసరం లేకుండానే శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మిడ్‌మానేర్, అక్కడి నుంచి ఎల్‌ఎండీ, మల్లన్నసాగర్, తదితర రిజర్వాయర్‌లకు నీటిని ఎత్తిపోశారు. అయితే వర్షాలపై ఆధారపడకుండా యుద్ధప్రాతిపదికన ప్రాణహితపై బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గోదావరి తీర ప్రాంతంలో యేటా వర్షాలు ఆలస్యంగానే కురుస్తున్నాయి. ప్రాణహిత ఎగువ ప్రాంతం లో ముందస్తుగానే వర్షాలు పడుతుంటాయి. జూన్ నెల నుంచే నదిలోకి వర్షపు నీళ్లు చేరతాయి. దీంతో అక్కడ 150 మీటర్ల ఎత్తులో నిర్మించే బ్యారేజీ నుంచి వర్షాకాలం ఆరంభం నుంచే శ్రీపాద ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేసుకునే అవకాశాలున్నాయి. శ్రీపాద నుంచి వెంట వెంటనే సాగునీటిని మిడ్ మానేరుకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు నీళ్లు రానున్నాయి. దీంతో వరి నాట్లు జూలై లోపే పూర్తి కానున్నాయి. ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి తుమ్మిడిహెట్టిని సందర్శించి ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పరిశీలిం చనున్నారు. త్వరగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుక వచ్చి 2027 వర్షాకాలం నాటికి బ్యారేజీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తు న్నది. ఏ మేరకు అది ముందుకు సాగుతుందో వేచిచూడాల్సిందే.