Share News

మున్సిపోల్స్‌కు మోగిన నగారా

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:58 PM

మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపోల్స్‌కు   మోగిన నగారా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మన్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 15 వార్డులు, మంథని మున్సిపాలిటీలో 13 వార్డులు, మొత్తం 124 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఎస్సీ జనరల్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ జనరల్‌, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌ కేటాయించగా, అన్ని డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు పూర్తి కాగా, ఆయా రాజకీయ పార్టీలు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే విషయమై తలమునకలయ్యాయి. ఆశావహులు టికెట్ల కోసం నేతల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రధానంగా అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఎక్కువ స్థానాల్లో పోటీ జరగనున్నది. బీజేపీ అభ్యర్థులు పలు స్థానాల్లో గట్టి పోటీనివ్వనున్నారు.

అకస్మాత్తుగా షెడ్యూల్‌ జారీ

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని అంతా ఊహించినప్పటికీ, నోటిఫికేషన్‌ ఫిబ్రవరి ఒకటవ తేదీన విడుదలవుతుందని, అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని భావించారు. అకస్మాత్తుగా 28వ తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత మంది ఆర్‌ఓలు, ఎంత మంది సిబ్బందిని నియమించాలి, వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం గాకుండానే ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికార యంత్రాంగం గందర గోళానికి గురవుతోంది. బుధవారం నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ఆరంభం కానుండడంతో అందరు ఆ జాతర మూడ్‌లో ఉన్న సమయంలో నోటిఫికేషన్‌ రావడం ఆశనిపాతంగా మారింది.

పట్టణాల్లో వేడెక్కనున్న రాజకీయాలు..

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో పట్టణాల్లో రాజకీయాలు వేడేక్కనున్నాయి. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఆయా రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఆశావహులు ఎక్కువ అయిన చోట సర్వేలు చేసి టికెట్లు ఇస్తున్నారు. కొన్ని పార్టీలకు చెందిన నాయకులు పార్టీలు మారుతున్నారు. ఒకే పార్టీకి చెందిన ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతుండడంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. కొందరు ఆశావహులు టికెట్లు రావని గ్రహించి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు బీఎస్పీ, సీపీఐ, సీపీఎం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. వీరికి తోడు తెలంగాణ జాగృతి పార్టీ తరపున కొందరు పోటీకి సిద్ధం అవుతున్నారు. వారందరికీ ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఆయా పార్టీల్లో టికెట్లు రాని నాయకులు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచే పోటీ చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్లు తెలంగాణ జాగృతి తరపున ఇవ్వనున్నారు. బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కానుండడంతో పట్టణాల్లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

రామగుండంలో 8నామినేషన్‌ కేంద్రాలు

కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది... ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఎన్నికల షెడ్యూల్డ్‌ జారీ చేసింది. దీన్ని అనుసరించి బుధవారం నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి నామినేషన్లు స్వీకరించే సమయాన్ని ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్ణయించారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమిది నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు డివిజన్లకు ఒక రిటర్నింగ్‌ అధికారి చొప్పున 30మంది రిటర్నింగ్‌ అధికారులు, మరో ఆరుగురిని కలిపి 36మందిని నియమించారు. అలాగే 36మంది ఏఆర్‌ఓలను నియమించారు. నగరపాలక సంస్థ నుంచి ఆయా నామినేషన్‌ కేంద్రాల్లో సహాయకులను ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో మంగళవారం సాయంత్రం నుంచి కోడ్‌ అమలులోకి వచ్చింది. రామగుండంకు సంబంధించి అడిషనల్‌ డిస్ర్టిక్ట్‌ ఎలక్షన్‌ అథారిటీగా అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ వ్యవహరించనున్నారు. మోడల్‌ కోడ్‌ కండక్ట్‌కు సంబంధించి ఏసీపీ శ్రీహరిని నియమించారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 60డివిజన్లలో మొత్తం 1,83,049ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 91,441కాగా, మహిళలు 91,578, ఇతరులు 30మంది ఉన్నారు. కార్పొరేషన్‌లోనే 22వ డివిజన్‌లో అత్యల్పంగా 2085మంది ఓటర్లు ఉండగా, ఈ డివిజన్‌ను ఎస్‌సీ మహిళకు రిజర్వు చేశారు. అత్యధికంగా గోదావరిఖని విఠల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 44వ డివిజన్‌లో 4,210మంది ఓటర్లు ఉన్నారు. ఇది ఎస్‌సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది.

నామినేషన్‌ కేంద్రాలు - డివిజన్లు

రామగుండం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, ముబారక్‌నగర్‌ - 25, 26, 27, 28, 29, 30

ఎన్‌టీపీసీ, టీటీఎస్‌ జెడ్‌పీహైస్కూల్‌ - 1, 33, 21, 22, 23, 24, 31, 32, 48, 49

గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సప్తగిరికాలనీ - 2, 34, 3, 35, 4, 7, 5, 6

గాంధీనగర్‌లోని సింగరేణి కమ్యూనిటీహాల్‌ - 8, 9, 10, 38, 36, 37, 39, 40

జవహర్‌నగర్‌లోని గ్రూప్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ - 11, 12, 41, 54, 42, 43, 52, 53

తిలక్‌నగర్‌డౌన్‌లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ - 13, 44, 45, 57, 55, 56

అశోక్‌నగర్‌ జెడ్‌పీ ఉర్దు మీడియం పాఠశాల - 14, 15, 16, 17, 18, 19, 20

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి) మున్సిపల్‌ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌ తెలిపారు. బుధవారం నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు సాగర్‌ రోడ్డు గేటు నుంచి రావాలని, అలాగే 100 మీటర్ల దూరం వరకు వాహనాలు తీసుకురావద్దని సూచించారు. నామినేషన్‌ వేసే వ్యక్తితోపాటు మరో ఇద్దరు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మన్‌రావులు మున్సిపల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు.

Updated Date - Jan 27 , 2026 | 11:58 PM