మిలాద్ ఉన్ నబీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:43 PM
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ నిర్వహించే సందర్భంలో ముందస్తు అనుమతులు తీసుకుని, నిర్ణయించిన మార్గాల్లో మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని తెలిపారు. అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టంలు, డీజేలు, ఇతర పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించకూడదని సూచించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు, నినాదా లకు దూరంగా ఉండాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని కోరారు. యువత శాంతి, క్రమశిక్షణతో వ్యవహరించి ఎలాంటి గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు సృష్టించే అవకాశం ఉందని, ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్ 112 కమిష నరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597 స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐలు, అధికారులు పాల్గొన్నారు.