Share News

రాజ్యాంగ విలువల పరిరక్షణకు చర్యలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:07 AM

రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణరావు, మక్కాన్‌ సింగ్‌, కలెక్టర్‌ కోయశ్రీహర్షలతో కలిసి పాల్గొన్నారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణకు చర్యలు

పెద్దపల్లి కల్చరల్‌,ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణరావు, మక్కాన్‌ సింగ్‌, కలెక్టర్‌ కోయశ్రీహర్షలతో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం రచించడంలో డ్రాఫ్టింగ్‌ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ కీలకపాత్ర పోషించారన్నారు. అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌, కమ్యూనిటీ హాల్‌తో ఒక హబ్‌ తయారు చేద్దామని, ఈ నిర్మాణాలకు సంబంధించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఈ నాలెడ్జ్‌ సెంటర్‌ వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 30 కోట్ల వరకు మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెల్లాలనే ఉద్దేశంతో తమ నాయకులు రాహుల్‌ గాంధీ నిత్యం పని చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు తాము నిరంతరం పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే తరాలకు అంబేద్కర్‌ స్ఫూర్తి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టా మన్నారు. దళితవర్గాల అభ్యున్నతి కోసం గతంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తీసుకువచ్చామన్నారు. రెండేళ్ల నుంచి ఎస్సీ సబ్‌ ప్లాన్‌ గైడ్‌ లైన్స్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమ ణరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య రూపంతో అతిపెద్ద రాజ్యాంగాన్ని బీఆర్‌ అంబేద్కర్‌ తీర్చిదిద్దారని తెలిపారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ గౌరవించాల్సిన వ్యక్తి అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసే ఆలోచన తనకు ఎప్పుడు లేదని ప్రభుత్వ విప్‌ అన్నారు. అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని, దానికి సంబంధించిన ప్రకటన చేయాలని ప్రభుత్వ విప్‌ మంత్రిని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిందని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు, నిధులు అందిస్తుందని, ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను, ఆలోచనలను కొనసాగిస్తూ, ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. అదనపు కలెక్టర్‌ వేణు, డీసీపీ రాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:07 AM