సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చర్యలు
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:41 PM
రైతులకు సాగునీరు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఓదెల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రైతులకు సాగునీరు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు అవసరానికి మించి యూరియా, డీఏపీ ఎరువులను వినియోగించడం వల్ల భూముల్లో సారం తగ్గిపోతుందన్నారు. గతంలో ఎకరానికి అర బస్తా యూరియా కూడా వినియోగించేవారు కాదని, ప్రస్తుతం విచక్షణారహితంగా ఎరువులు వాడడం భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు, వ్యవసాయ అధికారులు రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలన్నారు. యాసంగి సీజన్‌లో యాప్ ఆధారిత యూరియా సరఫరా విధానం అమలుతో ఎరువుల వినియోగం క్రమబద్ధీకరించబడిందని, భూముల సారం మెరుగుపడి ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి నమోదైందని గుర్తు చేశారు. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీ నీరు కోసం సీఎంతో మాట్లాడి సాగునీరు అందిస్తానని తెలిపారు. సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. నీటి విడుదలకు ముందే కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతోపాటు గతంలో కాలువల ద్వారా చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. శానగొండ, జీలకుంట, హరిపురం, గోపరపల్లి, కొలనూర్, ఓదెలతోపాటు పలు గ్రామాల సర్పంచులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డీఎల్‌పీవో, మండల స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి, ఎంపీడీవో అనిల్ రెడ్డి, తహసీల్దార్ వనజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచులు,సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్, అధికారులు పాల్గొన్నారు.