Share News

దీక్షా దివస్‌ సభ విజయవంతం చేయండి

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:22 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈనెల 29న కరీంనగర్‌ అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్‌ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు.

దీక్షా దివస్‌ సభ విజయవంతం చేయండి

గోదావరిఖని, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈనెల 29న కరీంనగర్‌ అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్‌ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సింగరేణి కార్మికులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. శుక్రవారం కాశిపల్లి ఎన్‌టీపీసీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, కొత్త పథకాలు వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. పథకాల కంటే కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో మరోసారి ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని, సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు గతంలో నిర్మించిన ప్రాజెక్టులను పరిరక్షించుకోవాలన్నారు. సింగరేణిలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కౌశిక్‌ హరి, ఫ్లోర్‌ లీడర్‌ మేకల సమ్మయ్య యాదవ్‌, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, నాయకులు బొడ్డు రవీందర్‌, తోకల రమేష్‌, జేవీ రాజు, పర్లపల్లి రవి, ఈదునూరి శ్రీకాంత్‌, గోలి రమణారెడ్డి, నూతి తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:22 PM