Share News

యాసంగికి మొక్కజొన్న సాగు చేయాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:50 PM

ఎల్‌నినో ప్రభావం రానున్న రోజుల్లో అధికంగా ఉండబోతోందని, రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కె గార్డెన్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ చేశారు

యాసంగికి మొక్కజొన్న సాగు చేయాలి

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం రానున్న రోజుల్లో అధికంగా ఉండబోతోందని, రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కె గార్డెన్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ చేశారు. విప్‌ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. జిల్లా రైతులను దృష్టిలో ఉంచుకోని ఎస్సారెస్పి సాగునీరు సరఫరా చేసేందుకు మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదించినట్లు తెలిపారు. వరిపంట చివరిదశకు చేరుకుందని చివరి తడి ఇచ్చేందుకు కెనాల్‌ ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే యాసంగిలో వరి పంట వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటను సాగు చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సన్న రకానికి క్వింటాల్‌కు రూ.3200 నుండి 3500 వరకు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని కోరారు. పట్టణంలోని చందపల్లి వద్ద ఉన్న కెనాల్‌ కాలువను పరిశీలించారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిరంతర ప్రక్రియ

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు నిలిపివేస్తామని కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అపోహలు ఎవరు నమ్మవద్దని, పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. 63 మంది లబ్ధిదారులకు చెక్కులను ప్రభుత్వ విప్‌ పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, తహసీల్దార్‌ రాజయ్య, కౌన్సిలర్లు పస్తం లక్ష్మీహన్మంతు, గుజ్జుల కుమారస్వామి, జగధీష్‌, నాంసాని శ్రీనివాస్‌, తోట ఫణిందర్‌, నల్లాల పద్మ, కోట్టె స్వరూపసదానందం, అమ్రేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల నరేష్‌, సర్పంచ్‌లు గంట రమేష్‌, ఆరె సంతోష్‌కుమార్‌, గుర్రపు అంజయ్య, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:50 PM