Share News

పంచాయతీలకు మహర్దశ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:27 AM

రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో గత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి జీపీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి.

పంచాయతీలకు మహర్దశ

జగిత్యాల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో గత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి జీపీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్య పనుల నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, చెత్తాచెదారాన్ని తరలించే ట్రాక్టర్లకు సైతం డీజిల్‌ పోసేందుకు అప్పులు చేసి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. కార్యదర్శులు గ్రామపంచాయతీల భారాన్ని తమ మీద వేసుకుని కొంతమేర నెట్టుకువచ్చినప్పటికీ పంచాయతీల అభివృద్ధిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

ఫ జిల్లాలో 385 జీపీలకు కేటాయింపు

జిల్లా వ్యాప్తంగా 385 గ్రామపంచాయతీ ఖాతాల్లో రూ.22.31 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులను జమ చేసింది. ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.150ల చొప్పున కేటాయిస్తుండగా ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10 నుంచి 20 శాతం అదనంగా నిధులను కేటాయిస్తుంది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్‌డీఎఫ్‌ గ్రాంట్‌ ఇప్పటి వరకు మంజూరు కాలేదు. కేంద్రం 2023-24 సంవత్సరానికి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసినప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను మంజూరు చేయాల్సి ఉంది.

ఫతాగునీరు, పారిశుధ్య పనులకు ప్రాధాన్యం

కేంద్రం మంజూరు చేసిన నిధులను తాగునీరు, పారిశుధ్య పనులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ నిధులతో తాగునీరు, పైపులైన్‌ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, చెత్తా చెదారాన్ని తరలింపు, నిర్వహణ కేంద్రాలకు 60శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పంచాయతీ భవనాల మరమ్మతు, శ్మశాన వాటికల సదుపాయాలకు 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు మంజూరైన నిధులను పాలక వర్గాలు ఖర్చు చేస్తేనే మిగిలిన నిధులు మంజురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు

-జున్ను రాజేందర్‌, సర్పంచ్‌, చల్‌గల్‌, జగిత్యాల రూరల్‌ మండలం

గ్రామ పంచాయతీకి మంజూరైన నిఽధులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం కల్పిస్తాం. మిగిలిన నిధులతో ప్రజల అవసరాన్ని బట్టి వినియోగిస్తాం.

పారదర్శకంగా వినియోగించాలి

-మదన్‌ మోహన్‌, జిల్లా పంచాయతీ అధికారి

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘ నిధులను కేంద్రం ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. గ్రామ సభలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఖర్చు చేయాలి. నిధుల వినియోగంపై పకడ్బందీగా పర్యవేక్షణ నిర్వహిస్తాం.

Updated Date - Mar 03 , 2026 | 12:27 AM