అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా లాడ్జిలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:49 PM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల లాడ్జిలు, హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. వీటిపై పోలీస్ నిఘా కొరవడడంతో నిర్వాహకులు, లీజుదారులు డబ్బులు దండుకునేందుకు వక్రమార్గాలు వెతుకుతున్నారు. మూడు ముక్కలాట లాడ్జిల్లో సాధారణమనే పరిస్థితి ఏర్పడింది.
కోల్సిటీ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల లాడ్జిలు, హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. వీటిపై పోలీస్ నిఘా కొరవడడంతో నిర్వాహకులు, లీజుదారులు డబ్బులు దండుకునేందుకు వక్రమార్గాలు వెతుకుతున్నారు. మూడు ముక్కలాట లాడ్జిల్లో సాధారణమనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పెద్దపల్లి పట్టణంలోని లాడ్జిలు ఈ మూడు ముక్కలాటకు అడ్డగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు పేకాట నిర్వాహకులుగా మారి జూదాన్ని లాడ్జిల్లో కొనసాగిస్తున్నారు. సాధారణ అద్దెల కంటే 10రెట్లు లాభం వచ్చేలా నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అద్దెలు రోజుల లెక్కల నుంచి గంటల లెక్కలకు మారిపోతున్నాయి. ప్రత్యేకంగా ’కేటు’ తీసి అందులో నుంచి వివిధ విభాగాల సిబ్బందికి ఖర్చులు తీస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా కింది స్థాయి పోలీస్ సిబ్బంది ఆయా ప్రాంతాల క్రైమ్ పార్టీలకు ఈ కేట్ నుంచే మామూళ్లు వెళుతున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఏ లాడ్జిలో ఎంత ఆట సాగుతుందనే విషయంపై కొందరికి ముందస్తుగానే సమాచారం ఉంటుందనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని చాలా లాడ్జిల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా ఉండడం, వాటి నిర్వహణ లోపాలు సరి చేయకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా పోలీసులు లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు జరుపాలని డీజీపీ నుంచి ఆదేశాలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. జిల్లాలోని కొన్ని లాడ్జిలు మూడు మూక్కలాటలకు పేరిన్నికగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. నిర్వాహకులు అనుమానాలు రాకుండా గుట్టు చప్పుడుగా ఈ దందా సాగిస్తున్నారు. గేమ్ స్థాయిని బట్టి లాడ్జిలను ఎంపిక చేసుకోవడం, అందులో నుంచి కేట్ రూపంలో లక్షలు దండుకోవడం పరిపాటిగా మారింది. లాడ్జిలతోపాటు కొత్తగా పలుప్రాంతాల్లో వెలసిన రిసార్ట్లు, కొన్ని బంకెట్ హాల్స్ సైతం ఈ జూదానికి వేదికగా మారాయి. రామగుండం కమిషనరేట్లో ఇటీవల మళ్లీ టాస్క్ఫోర్స్ తన కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో పలు చోట్ల పేకాటలు పట్టుబడుతున్నాయి. చాలా ఠాణాల్లో గతంలో పేకాటలో పట్టుబడిన వారికి సంబంధించి సరైన రికార్డులు లేవు. ఇటీవల పేకాటపై గేమింగ్యాక్ట్ కింద కేసులు నమోదుచేస్తున్నా ఆయా ఠాణాల పరిధిలో నిర్వాహకులు, జూదరులకు ఆశ్రయం ఇస్తున్న వారి వివరాలు ఉండడం లేదు. గతంలో మంచిర్యాలలో పేకాట నిర్వహిస్తున్న ఒక లాడ్జి కమిషనరేట్ పోలీసులు సీజ్ చేశారు. కొన్ని రోజులు లాడ్జిల్లో కార్యకలాపాలు అదుపులోకి వచ్చినట్టు కనిపించినా మళ్లీ కొన్ని రోజులుగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మూడు ముక్కలాటల్లో జూదరులు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే విమర్శలుసైతం ఉన్నాయి.