బతుకునివ్వమ్మా.. బతుకమ్మా
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:13 AM
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పురాణ గాథలు.. కుటుంబాల అనుబంధాలు, బతుకు బాధలను పాటలుగా పాడుతూ ఆడపడుచులు ఆటపాటలతో జరుపుకునే పెద్ద బతుకమ్మ పూల జాతరకు రంగం సిద్ధమైంది.
(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పురాణ గాథలు.. కుటుంబాల అనుబంధాలు, బతుకు బాధలను పాటలుగా పాడుతూ ఆడపడుచులు ఆటపాటలతో జరుపుకునే పెద్ద బతుకమ్మ పూల జాతరకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి ఇల్లు తీరక్క పూలతో నిండిపోయింది. సద్దుల బతుకమ్మతో కన్నుల పండుగ వేడుకలకు ఇందుకోసం సిరిసిల్లలో మున్సిపల్, గ్రామాల్లో పంచాయతీ పలకవర్గాలు బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారం రోజుల పాటు బతుకమ్మలతో మహిళలు అనందోత్సాహాల మధ్య గడిపి బతుకు నీవమ్మా... బతుకమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఎంతో అట్టహాసంగా సాగిన సంబరాల్లో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెద్ద బతుకమ్మతో ఇక వెళ్లి రావమ్మ అంటూ సాగనంపనున్నారు. బతుకమ్మ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఆడపడుచులు పుట్టింటికి వచ్చి సందడి చేసే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. బతుకమ్మ అంటే తీరొక్క రంగుల పూలతో పడుచుల్లో ఆనందాన్ని నింపుతాయి. బతుకమ్మను ఆదిశక్తిగా పల్లెపల్లెలో ఏ తారతమ్యాలు లేకుండా ఆడపడుచులు జరుపుకుంటూనే ఉంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద బతుకమ్మను మహిళలు జరుపుకుంటే.. మగవారంతా తంగేడు, గునుగు పూలను సేకరించి తీసుకొస్తారు. ఇంటిల్లి పాది ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను పేరుస్తారు. పెద్ద బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు ధరించి గౌరి దేవిని కీర్తిస్తూ ప్రధాన కూడలి వద్ద ఆడ పడుచులు బతుకమ్మ ఆట పాట ఆడుతారు. చీకటి పడుతున్న వేళ ఊరి శివారులోని వాగులు, చెరువుల వద్దకు ఊరేగింపుగా తీసుకొని వెళుతారు. పెద్ద బతుకమ్మకు వీడ్కోలు పలుకుతారు. రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆడపడుచులు వాయినాలు ఇచ్చుకుంటారు.
బతుకమ్మ నిమజ్జనాలకు ఏర్పాట్లు
జిల్లా కేంద్రంలోని మానేరు వాగు తీరంలో సిరిసిల్ల మున్సిపల్ శాఖ పలుచోట్ల బతుకమ్మ నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మానేరు వాగులో నిర్మించిన బతుకమ్మ ఘాట్ పండుగకు మరింత శోభను ఇస్తుంది.. విద్యుత్ దీపాలతో పాటు వాగులో ప్రత్యేకంగా నీటి సౌకర్యాన్నికల్పించారు. వేములవాడ పట్టణంలో రెండు రోజుల ముందే పెద్ద బతుకమ్మ సంబరాలు జరగగా మిగతా సిరిసిల్ల, చందుర్తి, తంగళ్లపల్లి, బోయిన్పల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వేములవాడ రూరల్, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వీర్నపల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటల వద్ద విద్యుత్ దీపాలు, ప్రత్యేక ఏర్పాటు చేశారు.
మహిళలకే కాదు.. పురుషులకూ సంబరమే
పెద్ద బతుకమ్మను ముస్తాబు చేయడం, పేర్చడంలో మగవాళ్ల పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం గతంలో బతుకమ్మ సంబరాల్లో మగవాళ్లకు కూడా బతుకమ్మ పేర్చే పోటీలు నిర్వహించడం విశేషం. పెద్ద బతుకమ్మ మహిళలతో పాటు పురుషులు కూడా బిజీ బిజీగా మారిపోతారు. తెల్లారక ముందే చల్లని గాలి వీస్తుండగా కంచెల మీది కట్ల పూలు, గుడిసెల మీది గుమ్మడిపూలు, ఊళ్లకు అనుకొని ఉన్న పెరట్లో, అడవిలో గునుగు, తంగేడు పూలను చెరువుల్లోని తామర పూలను మగవాళ్లు, పిల్లలు తీసుకొస్తారు. పెద్ద బతుకమ్మను పేర్చడంలోనూ మగవాళ్లు ఎంతో సంప్రదాయాన్ని పాటిస్తారు. బతుకమ్మ పేర్చడం మగవాళ్లు పూర్తి చేసిన తరువాత గుమ్మడి పువ్వుతో పాటు ఒక తమల పాకులో గౌరమ్మను పసుపుతో చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత రంగు రంగుల పట్టుచీరలతో మహిళలు అలంకరించుకొని మాపటేల ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మను ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పడుతారు. మహిళల చప్పట్ల మధ్య అనేక పాటలు గౌరమ్మను కొలుస్తూ సాగుతాయి. మహిళల ఆటాపాట ముగిసిన తరువాత కూడా బతుకమ్మలను చెరువు గట్టుకో.. వాగుల వద్దకు మగవాళ్లే తీసుకొని వెళుతారు. ఆ తరువాత మహిళలు పోయిరామ్మ బతుకమ్మా అంటూ సాగనంపుతారు.
బతుకమ్మ సంబరాల్లో ఉపాధి వేట
పల్లెలు పట్టణాలను పూలతోటగా మారుస్తూ సాగే బతుకమ్మ సంబరాలు వ్యవసాయ కూలీలకు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పింస్తుంది. ఊరంతా బతుకమ్మ సంబరంలో ఉంటే పూలు అమ్ముతూ ఉపాధి వేటలో కూలీలు కనిపిస్తారు. సిరిసిల్ల మానేరు తీరం, మార్కెట్లో బతుకమ్మకు కావాల్సిన పూలు అమ్మడానికి ఒక రోజు ముందే వచ్చి అమ్మకాలు జరిపారు.