Share News

స్వీయ గణనకు చివరి రోజు..

ABN , Publish Date - May 10 , 2026 | 12:18 AM

దేశ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జనగణన - 2027 అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల ఉద్యోగులు, విద్యావంతులు గణనపై అవగాహన కల్పించడంతో పాటు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు.

స్వీయ గణనకు చివరి రోజు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

దేశ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో జనగణన - 2027 అత్యంత కీలకమైనది. ఇందులో భాగంగా పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలు నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ఏప్రిల్‌ 26 నుంచి మే 10వ తేదీ స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల ఉద్యోగులు, విద్యావంతులు గణనపై అవగాహన కల్పించడంతో పాటు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు. ఆదివారం అర్ధరాత్రితో స్వీయ గణనకు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనగణన, స్వీయ గణనపై అవగాహన కల్పిస్తూ వాక్‌ నిర్వహించారు. ప్రచార రథాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించి జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు వివిధ సంస్థల ప్రతినిధులు వాక్‌లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీతో పాటు మండలాల్లో 8138 మంది వివరాలు నమోదు చేశారు. ఇందులో 665 మంది ఇంటి పరిసరాలను మ్యాపింగ్‌ ప్రక్రియలో ఖచ్చితంగా చూపకపోవడం. ఇతర కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. స్వీకరణకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వాములను చేయడం కోసం ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు. మాధ్యమాల ద్వారా స్వీయ జనగణనలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు.

రేపటి నుంచి ఇంటింటికి ఎన్యూమరేటర్లు

జనగణనలో భాగంగా తొలి దశ గృహాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి జూన్‌ 9 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. రాజన్న జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రాంతాలవారీగా అధికార యంత్రాంగం మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం జిల్లాలో జనగణన కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించి వారికి శిక్షణ అందించారు. జనగణనకు అవసరమయ్యే కిట్లను ఇచ్చారు. జనగణన-2027 సంబంధించి కలెక్టర్‌ ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారిగా వ్యవహరిస్తారు. అదనపు సెన్సస్‌ ప్రిన్సిపల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌, జిల్లా సెన్సస్‌ అధికారిగా సీపీవోలు వ్యవహరిస్తారు, డివిజన్లలో ఆర్డీవోలు, డీఈవో, డీఏవో, జడ్పీ సీఈవో, డీపీవో, ఏడీసీవో తదితర అధికారులు ఉంటారు. మండలాల్లో చార్జి ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అడిషనల్‌ చార్జి ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, ఎంపీఈవోలు, మున్సిపాలిటీలో చార్జి ఆఫీసర్‌గా మునిసిపల్‌ కమిషనర్లు, అడిషనల్‌ చార్జ్‌ ఆఫీసర్లుగా మేనేజర్లు వ్యవహరిస్తారు. జిల్లాలో 1025మంది వరకు ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్‌వైజర్లను నియమించారు. జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల ఆధారంగా 700 నుంచి 800 మందికి ఒక బ్లాక్‌గా జిల్లాలో 1117 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లుగా విభజించారు. ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌గా జిల్లాలో 173 మందిని నియమించి సర్వే చేస్తారు. మొదటి దశలో ఒక్కో ఎన్యూమరేటర్‌కు కేటాయించిన 200 ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఇంటిని సందర్శించే ఎన్యూమరేటర్లు ఇంటి స్వరూపంతో పాటు గృహస్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య ఇంట్లో నివసించే వారి సంఖ్య కారు, జీపు, వ్యాన్‌, ద్విచక్ర వాహనాలు సైకిల్‌ వంటి వివరాలే కాకుండా టీవీ, రేడియో, గ్యాస్‌ కనెక్షన్‌, టెలిఫోన్‌, మొబైల్‌, స్మార్ట్‌ఫోన్‌, ఉపయోగించుకునే ధాన్యం, మొబైల్‌ నంబర్‌ వంటి వాటితో పాటు కుటుంబం సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు చెందిన వారి వివరాలు కూడా సేకరిస్తారు.

జనగణన-2011 జిల్లా లెక్కలు ఇలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,52,037 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 2,74,109 మంది మహిళలు 2,77,928 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,35,145 మంది ఉండగా, పురుషులు 2,15,791 మంది, మహిళలు 2,19,354 మంది ఉన్నారు. సిరిసిల్ల వేములవాడ పట్టణ ప్రాంతాల్లో 1,16,892 మంది ఉండగా పురుషులు 58,318 మంది, మహిళలు 58,574 మంది ఉన్నారు. ఇందులో ఆరు సంవత్సరాలలోపు 48,751 పిల్లలు మంది ఉన్నారు. బాలురు 25,099 మంది, బాలికలు 23,652మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 37,550మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో11,201 మంది ఉన్నారు. ఎస్సీలు 1,02,110 మంది, ఎస్టీలు 22,990మంది ఉన్నారు. జనాభాలో అక్షరాస్యత శాతం62.71 ఉంది. పని చేస్తున్న జనాభా 2,98,663 మంది ఉన్నారు.

మండలాల వారిగా జనగణన-2011

మండలం జనాభా ఇళ్లు

రుద్రంగి 16,095 3,867

చందుర్తి 33,587 8,462

వేములవాడ రూరల్‌ 30,317 7,869

బోయిన్‌పల్లి 39,240 10,235

వేములవాడ 50,158 12,383

సిరిసిల్ల 92,001 22,721

కోనరావుపేట 40,857 10,871

వీర్నపల్లి 13,363 3,106

ఎల్లారెడ్డిపేట 46,270 11,527

గంభీరావుపేట 46,878 11,602

ముస్తాబాద్‌ 44,217 10,912

తంగళ్లపల్లి 50,675 12,761

ఇల్లంతకుంట 48,379 12,676

మొత్తం 5,52,037 1,38,992

గోప్యంగా జన గణన వివరాలు

- సీబీ శ్రీనివాసచారి, జిల్లా ప్రణాళిక అధికారి

జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో స్వీయగణనతో పాటు ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు పూర్తి వివరాలు అందించి సహకరించాలి. జనగణనలో అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి. నిర్భయంగా వివరాలు ఇవ్వవచ్చు. దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన జనగణనను విజయవంతం చేయాలి.

Updated Date - May 10 , 2026 | 12:18 AM