Share News

భూముల రీసర్వే త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:23 PM

భూముల రీ సర్వే మొదటి దశలో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

భూముల రీసర్వే త్వరగా పూర్తి చేయాలి

పెద్దపల్లి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే మొదటి దశలో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వే పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి, త్వరగా పూర్తి చేయడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సర్వే పనుల్లో ఆలస్యం కాకుండా అదనపు బృందాలను ఏర్పాటు చేసుకొని సాంకేతిక వనరులు, యంత్ర పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. భూ రీసర్వేలో ఎదురయ్యే స్థానిక సమస్యలపై అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా పరిష్కరించాలని కమిషనర్‌ ఆదేశించారు. కలెక్టర్లు భూ రీసర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజూ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రావత్‌ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కోయశ్రీహర్షతోపాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రమాద బాధితులకు చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా సమీపంలోని ఆసుపత్రుల్లో తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. పీఎం రావత్‌ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. పథకం ప్రయోజనం రాష్ట్రంలో తక్కువగా ఉంటుందని, వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీని ద్వారా ఆరోగ్యశ్రీ నిధులను ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అన్ని ఆసుపత్రులు నమోదు చేసుకోవాలలన్నారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు నమోదైన కేసులకు సంబంధించి ఆసుపత్రుల నుంచి వచ్చే ధ్రువీకరణ అభ్యర్థులను పోలీసులు వెంటనే ఈ డీఏఆర్‌ పోర్టల్‌లో ఆమోదించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా నెక్స్ట్‌జెన్‌ ఎం పరివాహన్‌ మొబైల్‌ యాప్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:23 PM