Share News

కేటీఆర్‌ అసత్య ప్రచారాలు మానుకోవాలి

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:22 AM

ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇది ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు.

కేటీఆర్‌ అసత్య ప్రచారాలు మానుకోవాలి

పెద్దపల్లి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇది ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. శనివారం పెద్దపల్లి పట్టణం చీకురాయి రోడ్డు నుంచి జెండా చౌరస్తా వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, రేషన్‌ కార్డులపై సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి గింజ కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఘనత పెద్దపల్లి నియోజకవర్గానిదేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సన్నధాన్యానికి రూ.1540 కోట్ల బోనస్‌ చెల్లించగా, నియోజకవర్గంలో రైతులకు రూ.80.68 కోట్ల బోనస్‌ అందించామని తెలిపారు. వరంగల్‌ డిక్లరేషన్‌ హామీ మేరకు 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేర రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఏ ఒక్క రైతుకైనా లక్ష రుణమాఫీని ఏకకాలంలో చేశారా? అని ప్రశ్నించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా, తొలి విడతలో 3 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మరో పది రోజుల్లో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు. పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని, జిల్లా ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. పెద్దపల్లిలో ఆర్‌ఓబీ పనులు వేగంగా సాగుతున్నాయని, రెండు, మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.3,100 కోట్ల వడ్డీ బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ బీమా యోజనను కొనసాగిస్తూ విడతల వారీగా మహిళల ఖాతాల్లో వడ్డీ బకాయిలను జమ చేస్తోందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, నాయకులు గోపగాని సారయ్య గౌడ్‌, బూతగడ్డ సంపత్‌, బూషణవేని సురేష్‌ గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సింగిల్‌విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ మండల, పట్టణ, బ్లాక్‌ అధ్యక్షులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:22 AM