Share News

కరీంనగర్‌ : వేగం.. తీస్తోంది ప్రాణం..

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:37 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు రెండు ప్రమాదాలు, ఇద్దరు గాయాలపాలవుతున్నారు. అనధికారికంగా ప్రమాదాల సంఖ్య, గాయపడినవారి సంఖ్య నాలుగురెట్లు ఉంటుంది.

కరీంనగర్‌ :  వేగం.. తీస్తోంది ప్రాణం..

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు రెండు ప్రమాదాలు, ఇద్దరు గాయాలపాలవుతున్నారు. అనధికారికంగా ప్రమాదాల సంఖ్య, గాయపడినవారి సంఖ్య నాలుగురెట్లు ఉంటుంది. కారు, బైక్‌, ఆటో ఇలా వాహనం ఏదైనా.. అతి వేగం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్నాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- రెండు రోజుల క్రితం కరీంనగర్‌ శివారులోని బొమ్మకల్‌ బైపాస్‌రోడ్‌లో రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు వెళుతున్న కారు రోడ్డు పక్కన పార్క్‌ చేసిన టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు కారు ఓడో మీటర్‌ ద్వారా వెల్లడైంది. అతి వేగంతో కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొనటంతో కారు నడుపుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థితోపాటు ఇంటర్‌ విద్యార్థి కూడా మరణించాడు. శుక్రవారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణంచెందాడు. ఇలా ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. యువకుల ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

రహదారులపై మద్యం షాపులు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ, పోలీసు శాఖ, ఎక్సైజ్‌ శాఖ సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా సమన్వయం కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాల నివారణకు రహదారులపై మద్యం షాపులు, బెల్ట్‌షాపులు నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరం వరకు మద్యం షాపులు ఉండరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనపడటం లేదు. ఇంకోవైపు ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఇసుక, గ్రానైట్‌ లారీలు, ఆటోలపై చూసీచూడనట్లుగా రవాణాశాఖ వ్యవహరిస్తున్నది. నిత్యం వందలాది ఇసుక లారీలు, గ్రానైట్‌ లారీలు అధికలోడ్‌తో రవాణా సాగిస్తున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడంం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నామమాత్రపు చర్యలు

రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ‘స్పీడ్‌ గన్‌’ రవాణా శాఖ కార్యాలయంలో ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన హైవే గస్తీ బృందం జాడ లేకుండా పోయింది. ఇక డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నగరాలు, పట్టణాల్లో మాత్రమే చేపడుతూ, హైవే, ప్రధాన రహదారులను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నగరం, పట్టణాలలో 40 కిలోమీటర్లకు మించి వేగం ఉండదని, కాని ఇక్కడ డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తూ, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో హైవే, ఇతర రహదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌లు ఎందుకు పకడ్భంధీగా చేపట్టడంలేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారులు, రోడ్లపై మద్యం మత్తులో అతివేగంగా వెళుతున్న డ్రైవర్లను పరీక్షించాల్సిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరాలతో నగరంలో బార్ల వద్ద ఉండి ఈ పరీక్షలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాద స్థలాలను పోలీసు అధికారులు గుర్తించినప్పటికీ నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేయడంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని రాజీవ్‌రహదారితో పాటు జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు వెళ్లే రోడ్లపై నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల అతివేగం, ఏమరుపాటు, నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపడంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా, లైసెన్స్‌లేని వ్యక్తులు ఆటో, ఇతర వాహనాలను నడుపుతూ తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు.

రహదారులపై హోటళ్లలో మద్యం సిట్టింగ్‌లు

మరో వైపు రాజీవ్‌ రహదారి, ఇతర రహదారులను ఆనుకుని విచ్చల విడిగా దాబాలు, హోటళ్ళలో మద్యం సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రేషన్‌షాపులకు రెట్టింపుగా బెల్ట్‌షాపులు, దాబాలు నడుస్తున్నాయి. ఈ బెల్ట్‌షాపులు, దాబాల్లో 24 గంటలపాటు మద్యం అందుబాటులో ఉండడంతో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మత్తులో వాహనంపై అదుపును కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు.

30 డేంజర్‌ జోన్ల గుర్తింపు

రాజీవ్‌రహదారితోపాటు వివిధ రహదారులపై 30 వరకు డేంజర్‌ జోన్లను పోలీసులు గుర్తించారు. ఈ డేంజర్‌ జోన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నాలుగు వరుసలతో స్టేట్‌ హైవే-1గా రాజీవ్‌ రహదారి నిర్మాణం చేసినప్పటికీ మూలమలుపులు సరిచేయలేదు. గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు, ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు, రైల్వే క్రాసింగ్‌లను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌ వరకు 37 కిలోమీటర్లు రాజీవ్‌ రహదారి విస్తరించి ఉన్నది. ఈ 37 కిలోమీటర్ల దూరంలో 15కుపైగా డేంజర్‌ జోన్లు గుర్తించారు. ఇందులో కరీంనగర్‌ శివారులోని ఇరుకుల్ల మూల మలుపు, నుస్తులాపూర్‌, అలుగునూర్‌, కొత్తపల్లి, ఇందిరానగర్‌, ఎల్‌ఎండీ చేపల కాలనీ, మహాత్మానగర్‌, ఆర్టీఏ కార్యాలయం సమీపంలో, రామకృష్ణ కాలనీ, రేణికుంట, గుండ్లపల్లి గ్రామాల వద్ద మూలములుపుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజీవ్‌రహదారిపై అతివేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు దాటడం కష్టంగా మారింది. రాత్రి సమయాల్లో ఇది మరింత ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనాల వేగాన్ని తగ్గించడం, రాజీవ్‌రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల వద్ద ఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం, మూల మలుపులు సరిచేయడం, ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లను అంటించడం, రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్‌ చేయకుండా చర్యలు చేపట్టడం వంటివి చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంటుంది.

మూడేళ్లలో 607 మంది మృత్యువాత

కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గడిచిన మూడు సంవత్పరాలలో 2,212 రోడ్డు ప్రమాదాలు జరగగా 607 మంది మృత్యువాతపడ్డారు. మరో 2,068 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరగగా 192 మంది మృతి చెందగా, 701 మంది గాయపడ్డారు. 2024లో 774 రోడ్డు ప్రమాదాలు జరగగా 200 మంది మృత్యువాత పడ్డారు. 716 మంది గాయపడ్డారు. 2023లో 673 రోడ్డు ప్రమాదాలు జరగగా 215 మంది మృత్యువాత పడ్డారు. 651 మంది గాయపడ్డారు.

Updated Date - Apr 05 , 2026 | 12:37 AM