కరీంనగర్ : ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:00 AM
ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ విధానం ప్రవేశ పెట్టనుందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ జియోలజీ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
కరీంనగర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ విధానం ప్రవేశ పెట్టనుందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ జియోలజీ డైరెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ప్రయోగత్మకంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆన్‌లైన్ విధానం అమలు చేయనున్న నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో టీజీఎండీసీ అవగాహనా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఇసుక ఆన్‌లైన్ ప్రక్రియలో భాగంగా మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని తెలిపారు. ఈ విధానం ద్వారా వినియోగదారులకు ఇసుక సరఫరాను మరింత పారదర్శకంగా మార్చడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఇసుకను పొందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీనివల్ల భవన నిర్మాణ రంగంలో ఇసుక కొరత తీరడమే కాకుండా, అక్రమ రవాణా అరికట్టవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఈ యాప్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారులు పొందవచ్చన్నారు. ప్రయోగాత్మక జిల్లాల అనంతరం ఇసుక నిల్వలు ఉన్న రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఈ విధానం ప్రవేశపెడతామని తెలిపారు. ఇసుక అవసరం ఉన్నవారు మొబైల్‌లో మన ఇసుక వాహనం యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవాలని, లేదా టీజీఎండీసీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు లేనివారు గ్రామ పంచాయతీ కార్యదర్శులని సంప్రదించి బుక్ చేసుకోవాలన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మన ఇసుక వాహనం ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేసి విజయవంతమయ్యేలా చూడాలన్నారు. రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో నూతన ఇసుక విధానానికి అనుగుణంగా పని చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్, ప్రాజెక్టు మేనేజర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.