Share News

కరీంనగర్‌ : పెట్రోల్‌, డీజిల్‌ నోస్టాక్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:04 AM

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. జిల్లావ్యాప్తంగా 159 పెట్రోల్‌, డీజిల్‌ పంపులు ఉండగా 10 శాతం పంపులు మాత్రమే విక్రయాలు కొనసాగిస్తున్నాయి.

కరీంనగర్‌ :  పెట్రోల్‌, డీజిల్‌ నోస్టాక్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. జిల్లావ్యాప్తంగా 159 పెట్రోల్‌, డీజిల్‌ పంపులు ఉండగా 10 శాతం పంపులు మాత్రమే విక్రయాలు కొనసాగిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ దొరకక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో సుమారు 150 నుంచి 200 హార్వెస్టర్లు వరి కోస్తున్నాయి. వీటికి డీజిల్‌ అవసరం కావడంతో రైతులు 20 నుంచి 50 లీటర్ల క్యాన్లను తీసుకొని ఎక్కడ పంపు తెరిచి ఉన్నా అక్కడికి వెళ్లి క్యూ కడుతున్నారు. జిల్లాలో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ పంపుల్లో రోజుకు సగటున లక్షా 70వేల లీటర్ల పెట్రోల్‌, 3.50 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల వరకు డీజిల్‌ అమ్మకాలు జరుగుతాయి. స్టాక్‌ లేని కారణంగా అమ్మకాలు 10శాతానికి పడి పోయాయి.

బ్యాంకులకు సెలవు దినం కావడంతో డీడీలు తీసే వీలు లేక..

శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవుదినాలు కావడంతో బంకుల యజమానులు స్టాక్‌ కోసం డీడీలు తీసే వీలు లేక పోవడంతో నాలుగురోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ పంపులు మూత పడి తీవ్ర కొరత ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో సరఫరా కొంత తగ్గడంతో పంపుల యజమానులు డీడీలు తీసినా నాలుగైదు రోజులైనా స్టాక్‌ పంపించడం లేదని అంటున్నారు. గతంలో ఆయిల్‌ కంపెనీలు బంక్‌ యజమానులకు క్రెడిట్‌పై డీజిల్‌, పెట్రోల్‌ను అడిగినంత సరఫరా చేసేవి. ఇప్పుడు డబ్బు చెల్లించినా సరఫరా చేయడం లేదని బంకుల యజమానులు వాపోతున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిసేందుకు మరో రెండు రోజులు ఉండగా ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా కూడా కొన్ని బంకులు మూతపడ్డాయని అంటున్నారు.

రైతుల ఇక్కట్లు

మండల కేంద్రాలు, గ్రామాల్లోని పెట్రోల్‌, డీజిల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందకుంట మండలంలోని రెండు బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిలువలు లేక పోవడంతో రైతులు డీజిల్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో అక్కడ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. జమ్మికుంటలో పెట్రోల్‌, డీజిల్‌ నోస్టాక్‌తో పంపులను మూసివేశారు. వీణవంక మండలంలోని చల్లూరులో 3, వీణవంకలో 2 పెట్రోల్‌ బంకులు ఉండగా నాలుగు బంకులు పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో మూసివేయగా చల్లూరులోని ఒక బంకు వద్ద రైతులు, వాహనదారులు క్యూకట్టారు. మానకొండూర్‌లోని పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ అందుబాటుల్లో ఉన్నప్పటికీ రైతులు క్యాన్లతో క్యూకట్టి కొనుగోలు చేస్తున్నారు. తిమ్మాపూర్‌ మండలంలోని అల్గునూర్‌, కొత్తపల్లి, నుస్తులాపూర్‌ గ్రామాల్లోని పెట్రోల్‌ బంకులకు ఈ మండల పరిధిలోని వారే కాకుండా హుస్నాబాద్‌, సైదాపూర్‌ మండలలా నుంచి క్యాన్లలో తీసుకెళ్లడంతో తిమ్మాపూర్‌, అల్గునూరులోని కొన్ని పెట్రోల్‌, డీజిల్‌ బంకులు మూసివేశారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, ఆముదాలపల్లి, గద్దపాక బంకుల వద్ద రైతులు డీజిల్‌ కోసం పెద్ద ఎత్తున క్యూకట్టి రెండు, మూడు రోజులకు సరిపడే డీజిల్‌ను తీసుకెళ్లారు. హుజురాబాద్‌లోని ఎనిమిది బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు లేకపోవడంతో వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిగురుమామిడి మండలంలోని ఆరు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ కొరత ఏర్పడటంతో రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సైదాపూర్‌లో బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ స్టాక్‌ లేక పోవడంతో బంకులను మూసివేశారు. దీంతో రైతులు డీజీల్‌ కోసం తిమ్మాపూర్‌, హుస్నాబాద్‌ తదితర ప్రాంతాలకు రైతులు వెళ్తున్నారు.

డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదు

- వినోద్‌కుమార్‌, పెట్రోల్‌ పంపుల యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. శనివారం, ఆదివారం బ్యాంకు సెలవులు ఉండడం, కొంత మంది బంక్‌ యజమానులు అంతకుముందే డీడీలు తీసి పంపించినా స్టాక్‌ సరఫరా కాకపోవడంతో తాత్కాలికంగా బంకులను మూసివేశారు. డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదు. ఒకటిరెండురోజుల్లో అన్ని బంకుల్లోకి స్టాక్‌ వస్తుంది.

Updated Date - Apr 28 , 2026 | 01:04 AM