Share News

కరీంనగర్‌ : విద్యాశాఖలో కదలని ఫైళ్లు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:35 AM

ప్రభుత్వశాఖల్లో విద్యాశాఖ ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు విద్యాశాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కరీంనగర్‌ :  విద్యాశాఖలో కదలని ఫైళ్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రభుత్వశాఖల్లో విద్యాశాఖ ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. వ్యవసాయం, వైద్యం, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు విద్యాశాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆ శాఖకు అధికారి లేకపోవడం ఇప్పుడు జిల్లా విద్యారంగాన్ని పట్టి వేధిస్తున్నది. నిత్యం పని ఒత్తిడితో తలమునకలయ్యే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు జిల్లా విద్యాశాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగించడంతో పని ఒత్తిడితో సమయం ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా విద్యాశాఖలో ఫైళ్లు పేరుకుపోవడమే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదని, కనీసం డీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్‌ను కలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఒకటిరెండు రోజుల్లోనే క్లియర్‌ చేయాల్సిన ఫైల్స్‌ కూడా నెలరోజుల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిసింది. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల వ్యక్తిగత, విధినిర్వహణకు సంబంధించిన అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని, వాటిని క్లియర్‌ చేయాలని కోరేందుకు వెళితే జిల్లా ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు.

పెండింగ్‌లో మెడికల్‌ బిల్లులు

కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మంజూరు చేసిన మెడికల్‌ బిల్లులకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చేందుకు నెలరోజులకుపైగానే సమయం తీసుకుంటున్నారని, వైద్యఖర్చులు తడిసిపోయి వాటి బిల్లులు, సప్లమెంటరీ బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. 12, 24 నెలలకు సంబంధించిన ప్రత్యేక ఇంక్రిమెంట్ల ఫైళ్లు, సప్లమెంటరీ బిల్లుల కోసం ప్రధానోపాధ్యాయులకు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ విరమణ పొందిన హెచ్‌ఎంల ఫైళ్లు రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, ఏజీ కార్యాలయానికి పంపేందుకు కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు. విదేశీ ప్రయాణం కోసం ఉపాధ్యాయులు విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు డీఈవో కార్యాలయం ద్వారా పంపించాల్సి ఉంటుంది. అలాంటి ఫైళ్లను వెంటనే క్లియర్‌ చేయకుండా 20 రోజుల నుంచినెలరోజుల వరకు పెండింగ్‌లోనే పెడుతున్నారని, దీనితో అత్యవసరంగా విదేశాల్లో ఉన్న వారి పిల్లల వద్దకు వెళ్లేందుకు ముందుగా విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, డైరెక్టరేట్‌కు పంపేందుకు ఇంత ఆలస్యం చేయడం సరికాదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తు న్నారు. అనారోగ్యం కారణంగా పరీక్షల విధులు నిర్వహించలేని ఉపాధ్యాయుల పట్ల కనీస సానుభూతి కూడా చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పాఠశాలల్లో సమస్యలు

విధి నిర్వహణ, పాఠశాలలు, విద్యార్థుల సమస్యలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు ఇంచార్జి డీఈవో, అదనపు కలెక్టర్‌ను కలిసేందుకు వెళితే సీసీ కలువనీయడం లేదని, బిజీగా ఉన్నారని, వీడియో కాన్ఫరెన్సులో ఉన్నారని చెప్పడంతో కలిసే వీలు కూడా లేకుండా పోతుందని పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల, పాఠశాలలకు సంబంధించిన ఫైళ్లు, సమస్యలకు సంబంధించిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించక పోవడంతో ఆ తర్వాతకూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటంతటికీ పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖ అధికారి లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబరులో డీఈవో జనార్ధన్‌రావుపై ఆరోపణలు రావడంతో ఆయనను జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేయగా, కొద్దిరోజులపాటు డైట్‌ ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించడంతో దాదాపు నాలుగైదు నెలలుగా విద్యాశాఖలో సమస్యలకు సత్వరం పరిష్కారం దొరకడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారిని నియమించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Updated Date - Apr 11 , 2026 | 12:35 AM