Share News

కరీంనగర్‌ : ఆశావహుల్లో అయోమయం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:56 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన ఆశావహులందరిలో అయోమయం నెలకొన్నది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన వారు నిశ్చింతగా తమ తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు.

కరీంనగర్‌ :  ఆశావహుల్లో అయోమయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన ఆశావహులందరిలో అయోమయం నెలకొన్నది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన వారు నిశ్చింతగా తమ తమ డివిజన్లు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. గుర్తింపు పొందిన ఇతర రాజకీయపార్టీలు కూడా అభ్యర్థులను తేల్చకుండా నాన్చుతుండడంతో చివరి క్షణం వరకు అభ్యర్థులెవరో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కో పార్టీ నుంచి నలుగురు, ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారిలో ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలో ఆయా పార్టీలు నిర్ణయానికి రాలేకపోతున్నాయి.

- టీపీసీసీ వద్ద కాంగ్రెస్‌ జాబితాలు..

అధికార కాంగ్రెస్‌ పార్టీ స్ర్కీనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించి కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 40 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి ఒక్కొక్క పేరునే టీపీసీసీ పరిశీలనకు పంపించింది. మిగతా 26 డివిజన్లలో పార్టీ నిర్వహించిన సర్వేల నివేదికలు, స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు స్థానిక సర్వేల అవగాహనతో నిర్దారించుకున్న పేర్లతో రెండు లేక మూడు పేర్లను టీపీసీసీకి సూచిస్తూ ప్రతిపాదించారు. సమ్మక్క జాతరకు వెళ్లిన పార్టీ ముఖ్యనేతలు వాటిని పరిశీలించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా రెండు రోజులుగా ఆ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి సమాచారం జిల్లాకు అందలేదు. జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీల కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలు స్ర్కీనింగ్‌ కమిటీ నుంచి టీపీసీసీకి వెళ్లాయి.

- బీజేపీలో త్రీమెన్‌ కమిటీ..

భారతీయ జనతా పార్టీ మూడు సర్వేలు నిర్వహించి త్రీమెన్‌ కమిటీ ముందు ఆ నివేదికలు, నామినేషన్‌ వేసిన అభ్యర్థుల జాబితాను ఉంచింది. పార్టీలో మొదటి నుంచి సేవలందిస్తున్నవారిలో సర్వేల్లో ప్రజాభిప్రాయం వారి పట్ల ఎలా ఉంది, గెలిచే అవకాశాలున్నాయా.., లేక అక్కడ ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చి చేరిన వారిని పోటీలో నిలిపితే ఫలితం సానుకూలంగా ఉంటుందా అన్న విషయాల్లో విచారణ జరిపి అవగాహనతో అభ్యర్థులను ఎంపిక చేయమని కోరినట్లు సమాచారం. త్రీమెన్‌ కమిటీ మూడు రోజులుగా పలుసార్లు సమావేశమై సూత్రప్రాయంగా ఒక అవగాహనకు వచ్చిందని, ఇప్పటికే కొన్ని డివిజన్లలో టికెట్‌ పొందలేక పోతున్నవారిని పిలిపించి బుజ్జగింపులు ప్రారంభించినట్లు సమాచారం.

- తేలని బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అభ్యర్థులు

బీఆర్‌ఎస్‌ 40 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ప్రచార సామాగ్రి పంపించి ప్రచారం చేసుకోమని సూచించినట్లు తెలిసింది. అధికారికంగా మాత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. ఎంఐఎం నలుగురు అభ్యర్థులను మాత్రమే అధికారికంగా ప్రకటించింది.

- ప్రచారానికి తక్కువ గడువు

నాలుగు పార్టీల్లోనూ ఆశావహులందరూ తమ అభ్యర్థిత్వాలు తేలెదెన్నడని ఆందోళన చెందుతున్నారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నదని, చివరి నిమిషం వరకు అభ్యర్థిత్వాలు తేల్చకపోతే నామినేషన్లు వేసిన సొంత పార్టీ సభ్యులు ఉపసంహరణకు సమయం ఉంటుందా లేదా, వారు పోటీలో ఉంటే నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా అంటూ ఆందోళన చెందుతున్నారు. మూడు పార్టీల నాయకుల వద్దకు, వారు బస చేసిన ఇళ్ల వద్దకు, సమావేశ స్థలాల వద్దకు తిరుగుతూ కలిసిన నేతలందరికి గోడు వినిపించుకుంటూ అభ్యర్థిత్వం కోసం ముఖ్య నేతలను సిఫారసు చేయాలని ప్రాధేయపడుతున్నారు. అన్ని రాజకీయపార్టీల్లోనూ ఈ పరిస్థితి నెలకొని ఉంది.

- ఇతర పార్టీలదీ అదే వైఖరి

ప్రధాన రాజకీయపార్టీల్లో టికెట్‌ రాని పక్షంలో ఇతర పార్టీల బీ-ఫామ్‌తో పోటీలో దిగాలని కొందరు ఆయా పార్టీల పేరిట కూడా నామినేషన్లు వేశారు. ఆ పార్టీ నాయకులతో మాటామంతీ జరిపారు. చివరి క్షణం వరకు ప్రధాన పార్టీలు అభ్యర్థిత్వాల విషయం తేల్చకపోతే ఇతర పార్టీల బీ-ఫారం తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇతర పార్టీలు కూడా ఈ పరిస్థితులను తమకు అనువుగా మార్చుకునేందుకు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. దీంతో నామినేషన్లు వేసిన రాజకీయపక్షాల ఆశావహులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

- భారీగా నామినేషన్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా 736 మంది అభ్యర్థులు 1,257 సెట్ల నామినేషన్లు వేశారు. అత్యధికంగా బీజేపీ నుంచి 374 నామినేషన్లు, కాంగ్రెస్‌ నుంచి 309 నామినేషన్లు, బీఆర్‌ఎస్‌ నుంచి 252 నామినేషన్లు, ఎంఐఎం నుంచి 55 నామినేషన్లు, బీఎస్పీ నుంచి 13, సీపీఎం నుంచి మూడు, ఆమ్‌ ఆద్మీ నుంచి ఒకటి, గుర్తింపు పొందిన ఇతర రాజకీయ పార్టీల నుంచి 93 నామినేషన్లు వచ్చాయి. 157 మంది స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు.

జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 219 మంది అభ్యర్థులు 341 నామినేషన్లు వేశారు. అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచి 80 నామినేషన్లు రాగా, బీజేపీ అభ్యర్థులు 79 మంది, బీఆర్‌ఎస్‌ 64 మంది, బీఎస్పీ నుంచి ఆరుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, గుర్తింపు పొందిన ఇతర రాజకీయ పార్టీల నుంచి 44 మంది, స్వతంత్రులు 66 మంది నామినేషన్లు వేశారు.

- హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 189 మంది అభ్యర్థులు 304 నామినేషన్ల సెట్లను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి 89, బీజేపీ నుంచి 79, బీఆర్‌ఎస్‌ నుంచి 77 మంది, బీఎస్పీ నుంచి నలుగురు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 16మంది, స్వతంత్రులు 39 మంది నామినేషన్లు వేశారు.

- చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డులకు 74 మంది అభ్యర్థులు 117 నామినేషన్లు వేశారు. బీఆర్‌ఎస్‌ 35, బీజేపీ 31, కాంగ్రెస్‌ 26మంది, స్వతంత్రులు 19మంది, జనసేన ముగ్గురు, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఇద్దరు, బీఎస్పీ నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు.

-----------------

Updated Date - Feb 01 , 2026 | 12:56 AM