కరీంనగర్ : రంగంలోకి కేంద్ర బృందాలు
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:37 AM
గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది. సీబీఐ, ఈడీ, విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏకకాలంలో రంగంలోకి దింపింది. 2014 నుంచి ఇప్పటి వరకు గ్రానైట్ సంస్థలు జరిపిన ఉత్పత్తి, ఎగుమతులు, స్థానికంగా చేసిన అమ్మకాలు, కేంద్రానికి, రాష్ట్రానికి చెల్లించిన పన్నులు, జరిపిన లావాదేవీలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజులుగా సీఐడీతోపాటు కేంద్ర బృందాలు గ్రానైట్ ఉత్పత్తి క్వారీ సంస్థలు, పాలిషింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన రికార్డులన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఫెనాల్టీ చెల్లించకుండా..
చైనాకు జిల్లాకు చెందిన ఎనిమిది గ్రానైట్ ఎగుమతి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా 124.94 కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్‌ను తప్పుడు కొలతలు చూపించి ఎగుమతి చేశారని అధికారులు గుర్తించారు. ఇందుకు ఆరు రెట్లు ఫెనాల్టీ విధించి 749.66 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు. అప్పుడు గ్రానైట్ వ్యాపారులు కోర్టుకు వెళ్లి అక్రమాలు జరిగిన మేరకు ఫెనాల్టీ చెల్లించి క్వారీలు నడుపుకుంటామని, వాయిదాల వారీగా మిగతా సొమ్ము చెల్లిస్తామని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని మళ్లీ లావాదేవీలు ప్రారంభించారు. ఆమేరకు 124.94 కోట్ల రూపాయలు ఫెనాల్టీ చెల్లించాల్సి ఉండగా 11.08 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఎనిమిదేళ్లుగా దాని ఊసే పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్నారు. వేల క్యూబిక్ మీటర్ల ఎగుమతులు చేసినట్లు లెక్కల్లో చూపించి లక్షల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తరలించి చైనా నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని పొందారని కేంద్రం గుర్తించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఆదాయానికి గండడికొట్టింది ఎంతఅన్న విషయాన్ని నిగ్గుతేల్చి ముక్కు పిండి వసూలు చేసేందుకు నిర్ణయించిందని సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం తనిఖీలను ప్రారంభించి లోతుగా పరిశీలన జరుపుతూ ఉచ్చు బిగిస్తున్నదని తెలిసింది.
400కు పైగా పాలిషింగ్ యూనిట్స్
కరోనా కాలంలో ఎగుమతుల వ్యాపారం మందగించగా బడాబడా గ్రానైట్ సంస్థలు కూడా పాలిషింగ్ యూనిట్లను నెలకొల్పి స్థానికంగా గ్రానైట్ దిమ్మలను కోసి టైల్స్, షీట్స్ తయారు చేసి వివిధ రాష్ట్రాలలో విక్రయించడం ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలో 400కుపైగా పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. స్థానికులే కాకుండా రాజస్తాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితరప్రాంతాలకు చెందిన వారు స్థానికులు నెలకొల్పిన యూనిట్లలో కొన్నింటిని లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఎగుమతుల కంటే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశముందని, పన్నులు ఎగవేస్తూ జీరో బిజినెస్ చేస్తూ లాభాలు గడించవచ్చని వివిధ రాష్ట్రాల వ్యాపారులు ఈ యూనిట్లపై పెట్టుబడి పెట్టారని సమాచారం. గత నెల 21న నకిలీ ఇన్వాయిస్‌లు, వేబిల్లులతో గ్రానైట్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు జీఎస్టీ నిఘా విభాగం అధికారులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన దాసరి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ అక్రమాలకు పాల్పడుతుండగా పట్టుకుని తనిఖీలు నిర్వహించగా సుమారు 100 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ టైల్స్‌ను తరలించినట్లు గుర్తించారు. ఆయనను అరెస్టు చేసి డీజీజీఐ అధికారులు హైదరాబాద్ నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఉన్న వందలాది పాలిషింగ్ యూనిట్లలో కూడా ఈ వ్యవహారం కొనసాగుతున్నదని అనుమానిస్తున్న ఈడీ, డీజీజీఐ అధికారులు తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మిగతా సంస్థల్లోనూ ఇలాంటి దందా కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పుడు అన్ని పాలిషింగ్ యూనిట్లు, గ్రానైట్ క్వారీలు, ఎగుమతి సంస్థల వ్యవహారాల రికార్డులను పరిశీలించి అక్రమ వ్యవహారం గుట్టు తేల్చే పనిలో ఉన్నారని సమాచారం. గురు, శుక్రవారాల్లో తనిఖీలు జరగడంతో గ్రానైట్ వర్గాల్లో కలకలం చెలరేగింది.