Share News

కరీంనగర్‌ : కరీంనగర్‌లో ఆయుష్‌ ఆసుపత్రి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:30 AM

కరీంనగర్‌ జిల్లాకు ఆయుష్‌ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

కరీంనగర్‌ :  కరీంనగర్‌లో ఆయుష్‌ ఆసుపత్రి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ జిల్లాకు ఆయుష్‌ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆయుష్‌ ఆసుపత్రిని కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంలో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపించారు. ఉన్నతాధికారులతో పాటు, కేంద్ర ఆయష్‌ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ను పలుమార్లు కలిశారు. ఆయన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌లో ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటుకు పాలనా పరమైన అనుమతులు జారీ చేసింది.

50 పడకలతో..

కరీంనగర్‌లో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి మంజూరు చేయనున్నారు. ఈ ఆసుపత్రిలో ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్య చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కాయ చికిత్సకు 20, పంచకర్మ చికిత్సకు 10, శల్య సేవలకు 10 పడకలు, ఈఎన్టీ, ప్రసూతి, స్త్రీ ఆరోగ్య సేవలకు మిగతా పడకలను కేటాయించనున్నారు. ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటుకు 15 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి అందులో భాగంగా 7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో జిల్లా అధికారులు స్థల పరిశీలనపై దృష్టి సారించారు.

అన్ని విభాగాల్లో సిబ్బంది

ఆయుష్‌ ఆసుపత్రి మంజూరు కావడంతో ఆయుర్వేద, హోమియోపతి, యోగా, నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్సలతో పాటు, ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సకు అర్హులైన అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులో ఉంటారు. యోగా ట్రైనర్‌తోపాటు, పరిపాలన విభాగంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఇద్దరు డిప్యూటీ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, ఇద్దరు హెడ్‌ క్లర్క్‌లు, ఇద్దరు యూడీసీలు, ఏడుగురు ఎల్‌డీసీలు, 14 మంది నర్సింగ్‌ స్టాఫ్‌, ఇద్దరు నర్సులతో పాటు, ల్యాబ్‌ టెక్నిషియన్‌లు, రేడియోగ్రాఫర్‌, ఫార్మసిస్టులు సేవలు అందించనున్నారు. వీరితోపాటు హౌస్‌ కీపింగ్‌, లాండ్రి, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, గార్డెనర్‌, 21 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు.

ఆయుష్‌లో సేవలు

ఆయుష్‌ ఆసుపత్రిలో ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలతోపాటు, చర్మ జాయింట్‌ జీర్ణక్రియ, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. యోగా, నేచురోపతి, ప్రాణాయామం, ఽధ్యానం వంటి సేవలు అందించనున్నారు. ఒత్తిడి, బీపీ, షుగర్‌కు సంబంధించి కౌన్సెలింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హోమియోపతి విభాగానికి సంబంధించి పిల్లలు, మహిళలు, అలర్జీ, ఆస్తమా, మైగ్రేన్‌ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి యునాని, సిద్ధ వైద్య సేవలను అందుబాటులోకి తేనున్నారు. రోజువారి వైద్య సేవలు (ఓపీ), డైట్‌ న్యూట్రిషియన్‌ సలహాలు, ఆరోగ్య అవగాహన శిబిరాలు నిర్వహించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా సహజ పరిష్కార సేవలు ఆయుష్‌ ఆసుపత్రి ద్వారా కరీంనగర్‌ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Jan 10 , 2026 | 12:30 AM