Share News

కరీంనగర్‌ : స్టాంపు పేపర్లపై అదనపు బాదుడు

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:41 AM

జిల్లాలో స్టాంపు పేపర్ల విక్రయదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలుదారులు అడిగిన మొత్తాన్ని ఇవ్వక తప్పడం లేదు.

కరీంనగర్‌ :  స్టాంపు పేపర్లపై అదనపు బాదుడు

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్టాంపు పేపర్ల విక్రయదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విలువ కంటే అదనంగా వసూలు చేస్తూ వెండర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలుదారులు అడిగిన మొత్తాన్ని ఇవ్వక తప్పడం లేదు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలుండగా వీటి పరిధిలో 20 మంది వరకు అనుమతి పొందిన వెండర్లున్నారు. జ్యుడీషియల్‌ స్టాంపులతో పాటు ఫ్రాంక్లింగ్‌ యంత్రాల ద్వారా నిత్యం సుమారు 50 వేల వరకు వివిధ రకాల స్టాంపులు విక్రయిస్తుండగా ఆ శాఖకు లక్షల ఆదాయం సమకూరుతుంది. స్టాంపు వెండర్లకు 5 రూపాయల కమీషన్‌ ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అయినప్పటికీ అదనంగా వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. రూ.10 విలువ చేసే స్టాంప్‌ పేపర్‌ను ప్రభుత్వం రద్దు చేయగా కొంత కాలం నుంచి రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లు కూడా కొరతగా ఉంది. ప్రసుత్తం వెండర్ల వద్ద రూ. 20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లున్నాయి. వీటి విక్రయాలపై ప్రభుత్వం 5 శాతం కమీషన్‌ వెండర్లకు చెల్లిస్తోంది. వెండర్లు మాత్రం రూ. 20ల స్టాంపు పేపరును రెట్టింపుగా రూ.40లకు విక్రయిస్తున్నారు. అలాగే రూ. 50 స్టాంపు పేపర్‌ను రూ.70, రూ.100 స్టాంపు పేపర్‌ను రూ.140లకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే స్టాక్‌లేవని చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ విధానం అమలులో ఉన్నా

స్టాంపుల కొరత, నకిలీ స్టాంపుల విక్రయం ట్యాంపరింగ్‌ వంటి సమస్యలకు, అక్రమాలకు చెక్‌ పడేలా ప్రభుత్వం గతేడాది నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని అమలోకి తెచ్చింది. గతంలో స్టాంపులపై పాత తేదీలు వేసి విక్రయించడం వంటి మోసాలు జరిగేవి. కొనుగోలుదారుల అవసరాన్ని బట్టి అధిక మొత్తం వసూలు చేసేవారు. వెండర్లు రోజూ ఎన్ని స్టాంపులు విక్రయించారని కచ్చితమైన లెక్క ఉండేది కాదు. వీటిని నియంత్రిం చేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొనుగోలుదారుల వివరాలు, వెండర్లు ఏ రోజు ఎన్ని స్టాంపు పేపర్లు విక్రయించారనే పూర్తి వివరాలన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల అక్రమాలకు తావుండదని అధికారులు చెబుతున్నారు. అయితే వెండర్ల అదనపు వసూళ్లను మాత్రం నియంత్రించలేక పోతున్నారు.

అమలుకు నోచుకోని నిబంధనలు

నిత్యం ప్రజలు విద్య, ఉద్యోగం, పింఛన్‌, రేషన్‌, రుణాలు, అద్దె ఒప్పందాలు, నోటరీ పత్రాలు, భూ విక్రయాలు తదితర అవసరాల కోసం స్టాంపులు కొనుగోలు చేస్తుంటారు. నిబంధనల ప్రకారం స్టాంపు పేపర్‌ను నిర్ధేశించిన ధరకే (స్టాంపు పేపరుపై ముద్రించిన ధర)విక్రయించాలి. అదనంగా వసూలు చేయవద్దని నిబంధనలున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇదంతా సబ్‌ రిజిస్ట్రార్లకు తెలిసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో లైసెన్స్‌ పొందిన వెండర్లు వారి పరిధిలోనే స్టాంపు పేపర్లు విక్రయించాల్సి ఉంది. కానీ ఇతర ప్రాంతాలలో విక్రయించేందుకు లైసెన్స్‌లు తీసుకున్న కొందరు వెండర్లు కరీంనగర్‌లో యథేచ్ఛగా రెట్టింపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి. ఏ లైసెన్స్‌దారుడు, ఎక్కడ స్టాంపు పేపర్లు విక్రయిస్తున్నాడు? వారి లైసెన్స్‌ ఎక్కడ ఉన్నదనేది ఏనాడు తనిఖీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఆర్థికభారం మోపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అధిక విలువ గల స్టాంపులు మరింతగా ధర పెరిగిపోతుండటంతో ప్రజలు నష్టపోతున్నారు. ఫ్రాంక్లిన్‌ స్టాంపుల విక్రయంలో కూడా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుని, వారి లైసెన్స్‌ రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

అదనపు డబ్బులు వసూలు చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం

- జిల్లా రిజిస్ట్రార్‌ స్థితప్రజ్ఞ

స్టాంపుపేపర్ల విక్రయాల సందర్భంలో అదనంగా డబ్బులివ్వాలని అడిగిన వెండర్లపై ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. స్టాంపు పేపరుపైన ఉన్న డినామినేషన్‌ ప్రకారమే కొనుగోలుదారులు డబ్బులు చెల్లించాలి. అదనంగా డబ్బులు వసూలు చేశారని తేలితే వెండర్‌ లైసెన్సు రద్దు చేస్తాం. ఎవరినీ ఉపేక్షించబోం. నిబంధనల ప్రకారమే విక్రయాలు జరుపాలి.

Updated Date - Aug 02 , 2026 | 12:41 AM