కరీంనగర్ : ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:47 AM
కరీంనగర్‌లో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యమకారులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని విమర్శించారు.
కరీంనగర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌లో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యమకారులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని విమర్శించారు. తెలంగాణవాదులను అవమానపరిచే ఏ అంశాలను ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదన్నారు. ఉద్యమకాలంలో పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారన్నారు. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను తొలగించారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం వరకు తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఇది తెలంగాణవాదులను అవమానపరచడమేనన్నారు. గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వడం ఏమిటని, గద్దర్‌కు సినిమాకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణకు వస్తున్న పవన్‌కల్యాణ్ వెనక బీజేపీ హస్తం ఉందని, బీజేపీ వస్తే మన ఊరి దేవుళ్లను మాయం చేస్తారన్నారు. వాళ్ల కుట్రలను తెలంగాణ సమాజం గమనించి అప్రమత్తంగా ఉండాలని కవిత హెచ్చరించారు. తెలంగాణకు ప్రమాదం వస్తే ప్రాణం అడ్డుపెట్టి తెలంగాణ రక్షణ సేన కాపాడుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మగ నాయకుల పాలన చూశారు... మీ ఆడబిడ్డగా ఒక అవకాశమివ్వండి.. మార్పు ఎలా ఉంటుందో చూపిస్తానని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన 1200 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యమకారుల హక్కులను పోరాడి సాధించుకోవాలని తీర్మానించారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రూప్‌సింగ్, జిల్లా నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్, ఉద్యమకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.