Share News

కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ అందలేదు

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:27 PM

కాళేశ్వరం నీళ్లు ఏనాడు ఉమ్మడి జిల్లాకు అందిన దాఖలాలు లేవని, అందినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ కేటీఆర్‌, హరీష్‌రావుకు రోజు అబద్దాలు ఆడందే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ అందలేదు

కాల్వశ్రీరాంపూర్‌, జూలై21(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం నీళ్లు ఏనాడు ఉమ్మడి జిల్లాకు అందిన దాఖలాలు లేవని, అందినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మల్యాల శివారులో రూ.50 లక్షలతో నక్కలఒర్రెపై బ్రిడ్జి, మీర్జంపేటలో రూ.10 లక్షలతో మహిళా భవనం, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, తారుపెల్లి, మీర్జంపేట మధ్య కోటి55 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం, తారుపల్లిలో 20 లక్షతో జీపీ ప్రహరీ, రూ.15 లక్షలతో కల్వర్టు, 23 లక్షలతో పాఠశాల ప్రహరీ, రూ.40 లక్షలతో కేజీబీవీ ప్రహరీ, కోటి50 లక్షలతో మార్కెట్‌ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ గోదాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ కేటీఆర్‌, హరీష్‌రావుకు రోజు అబద్దాలు ఆడందే నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని క్రికెట్‌ ఆడుతున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మెదక్‌, గజ్వేల్‌కు నీళ్లుపోతుంటే ఏనాడైనా నియోజకవర్గానికి చుక్క నీరు తీసుకువచ్చాడని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మానేరు, మిడ్‌ మానేరుల్లో నీరు చేరితే ఇవి కాళేశ్వరం నీళ్లే అంటూ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. కేటీఆర్‌ కన్నెపల్లికి వెళ్లి కాళేశ్వరం నీళ్లు ఇవ్వవచ్చని తెలివ తక్కువ ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా తరలించేందుకు రూపకల్పన చేయగా, ఆ ప్రాజెక్టును కాదని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షానాలుగు వేల కోట్లతో కాళేశ్వరం నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ పేర దోపిడీకి తెరలేపారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమంగా ముందుకు సాగుతున్నారన్నారు. మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని గత ప్రభుత్వం ఆరు పడకలు చేసిందని, తమ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా మార్చి, నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 23 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి కాళేశ్వరం నీరు ఉపయోగించకుండా పండించిందన్నారు. రైతులు సేంద్రియ ఎరువులు, నానో యూరియాను వాడాలని కోరారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌లు రామిడి తిరుపతిరెడ్డి, చదువు రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌లు బంగారి రమేష్‌ ముదిరాజ్‌, భూసి సదాశివరెడ్డి, గాజనవేన స్వరూప సదయ్య, పోశాల శైలజ సదానందం, రావిశెట్టి లత సారయ్య, డీఎంఓ ప్రవీణ్‌రెడ్డి, తహసీల్దార్‌ రాపెల్లి రాముడు, ఏంసీ కార్యదర్శి ప్రేమ్‌ కుమార్‌, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, పాల్గొన్నారు.

బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే

మండలంలోని పెద్దరాత్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణరావు జమ్మికుంట నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సు ప్రారంభించారు. ఈ బస్సు మండలంలోని ఇదిలాపూర్‌, పెద్దరాత్‌పల్లి, కాల్వశ్రీరాంపూర్‌, మొట్లపల్లి, మీర్జంపేట, కిష్టంపేట తదితర గ్రామాల నుంచి జమ్మికుంట చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:27 PM