ముప్పు ముంగిట జనగామ...
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:17 PM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం ముప్పు ముంగిటకు చేరింది. 50ఏళ్ల నుంచి సింగరేణి ఆ గ్రామం కింద, పరిసరాల్లో భూగర్భ గనుల ద్వారా చేపట్టిన తవ్వకాలు ఇప్పుడు ఆ గ్రామానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.
కోల్‌సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం ముప్పు ముంగిటకు చేరింది. 50ఏళ్ల నుంచి సింగరేణి ఆ గ్రామం కింద, పరిసరాల్లో భూగర్భ గనుల ద్వారా చేపట్టిన తవ్వకాలు ఇప్పుడు ఆ గ్రామానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ భూమిపై గొయ్యిలు ఏర్పడుతున్నాయి. గతంలో జనగామ గ్రామంలో నివాసముండే పుల్లమ్మ అనే మహిళ తెల్లవారుజాము నుంచి లేచి ఇంటి గడపదాటి బయట కాలు పెట్టగానే భూగర్భంలో ఏర్పడ్డ గొయ్యిలో పడింది. గ్రామస్తులు అతి కష్టమీద ఆమెను బయటకు తీశారు. ఇప్పుడు మళ్లీ రెండు మూడేళ్లుగా ఇలాంటి గొయ్యిలు ఏర్పడుతున్నాయి. జనగామ పెట్రోల్‌బంక్ వెనుక ఒక వ్యాపారి బోర్ వేస్తే భూమిలోకి కుంగిపోయింది. రెండు రోజుల క్రితం యాదవనగర్‌లో హ్యాండ్ బోర్ కుంగింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో శనివారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సూచన మేరకు మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, కార్పొరేటర్లు, సింగరేణి అధికారులు గ్రామాన్ని సందర్శించారు. బోర్ కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, మహిళలు సింగరేణి అధికారులను నిలదీశారు. రాత్రికి రాత్రే మేము భూమిలోకి కుంగిపోవాలా అంటూ ప్రశ్నించారు. యాదవనగర్‌లోని బావులు, బోర్లు కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి సమీపంలో వేసిన వ్యవసాయ బోర్లు సైతం కుంగుతున్నాయని పేర్కొన్నారు. బొగ్గు తవ్వకాలు జరిపి ఖాళీగా వదిలి పెట్టడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఎక్కడ భూమి కుంగుతుందోననే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయంటూ వాపోయారు. జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ కేవలం భూగర్భంలో నీటి నిల్వలు తగ్గినప్పుడు భూమి పొరల్లో ఏర్పడే కదలికల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని, ఇవి ప్రమాదకరమైన పరిస్థితులు కావన్నారు. డీజీఎంఎస్‌కు పరిస్థితిని నివేదిస్తామన్నారు. గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, ఆందోళన చెందవద్దన్నారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం దీనిపై చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెస్తామని, గ్రామాభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తామని పేర్కొన్నారు. స్టౌవింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో పాటు జియలాజికల్, ఎన్విరాన్‌మెంట్ నిపుణులతో గ్రామంలో సర్వేచేస్తామన్నారు. కుంగిన బోర్‌ను పరిశీలిస్తున్న క్రమంలో భారీ గొయ్యి ఏర్పడింది. గ్రామం, పరిసర ప్రాంతాల్లో మైనింగ్ జరిగినందున వల్ల కొన్ని చోట్ల 120, కొన్ని చోట్ల 200 అడుగుల లోపే బోర్లు వేసుకోవాలని, అంతకు మించి లోతుకు బోర్లు వేస్తే సమస్యలు ఎదురవుతాయని సింగరేణి అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తులు తోకల రమేష్, జువ్వాడి విజయ్, కృపాకర్‌రావు, మల్లేష్, అర్కుటి శంకర్, ఎస్‌ఓటూ జీఎం చంద్రశేఖర్, ఏజెంట్ రమేష్‌బాబు, డీజీఎం వర ప్రసాద్, కార్పొరేటర్లు గట్ల రమేష్, సాంబమూర్తి తదితరులు పరిశీలించారు.
బీజేపీ నాయకుల పరిశీలన
జనగామలో బోరు కుంగిన ప్రాంతాన్ని శనివారం బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి, గుండబోయిన భూమయ్య, పృథ్విరాజ్ తదితరులు పరిశీలించారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామాన్ని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తరలించాలని డిమాండ్ చేశారు.