Share News

జగిత్యాల : గోదాముల కోసం అన్వేషణ

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:49 AM

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్‌ గోదాములను గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.

జగిత్యాల :  గోదాముల కోసం అన్వేషణ

జగిత్యాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్‌ గోదాములను గుర్తించే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలు, మూసివేసిన సినిమా హాళ్లు, ఇతర గోదాములను పరిశీలిస్తున్నారు. గత యాసంగిలో మార్క్‌ఫెడ్‌ రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేసి పలు గోదాముల్లో నిల్వచేశారు. సంబంధిత మొక్కజొన్న నిల్వలను టెండర్‌ద్వారా ప్రభుత్వం విక్రయించింది. వాటిని ఖాళీ చేయించి ఆ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ధాన్యం పక్కదారికి చెక్‌ పెట్టడానికే..

కొన్నేళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు సీఎంఆర్‌ కోసం అప్పగిస్తోంది. మిల్లర్లు ధాన్యం గానుగాడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్‌ సప్లయి శాఖలకు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మిల్లర్లు పెద్దఎత్తున ధాన్యం పక్కదారి పట్టించి ఆర్జిస్తున్నారని, ప్రభుత్వానికి వాయిదాల పద్ధతిలో ఎంతోకొంత చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల సుమారు 7మిల్లుల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌అధికారులు విస్తృతతనిఖీలు చయడంతో లోపాలు బహిర్గమతమయ్యాయి. సుమారు రూ.130కోట్ల విలువ గల ధాన్యం నిలువలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దీంతో ఈసారి ధాన్యాన్ని మిల్లర్లకు వెంటనే ఇవ్వొద్దని, ఎక్కడికక్కడే నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అక్టోబర్‌ నుంచి జిల్లాలో వానాకాలం ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనా ఉంది. సుమారు 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

జిల్లాలో గుర్తింపు..

జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని గోదాములు, ఎస్‌డబ్ల్యూసీ (స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌), పీఏసీఎస్‌ సహా ప్రభుత్వరంగంలోని పలు గోదాములును అధికారులు గుర్తించారు. కొన్ని ప్రైవేట్‌గోదాములు, ఫంక్షన్‌ హాళ్లు వంటివి ఎంపిక చేశారు. సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం కలిగిన వాటిని ఇప్పటివరకు గుర్తించారు. ఇంకా అవసరం మేరకు క్యాప్‌ గోదాములు ఏర్పాటు చేయలని భావిస్తున్నారు. ఖాళీస్థలంలో ధాన్యం బస్తాలు ఎత్తుగా పేర్చి అవి వర్షానికి తడవకుండా, గాలి తగలకుండా ప్లాస్టిక్‌ టార్పలిన్‌తో కప్పేస్తారు. నిల్వల పరిరక్షణ భాధ్యత సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌, ఎస్‌డబ్ల్యూసీ అధికారులు పర్యవేక్షించనున్నారు.

గోదాములను గుర్తిస్తున్నాం..

- జితేందర్‌ రెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయి అధికారి, జగిత్యాల

జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశాం. ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవసరమైన గోదాములను ఎంపిక చేస్తున్నాం. సుమారు లక్ష మెట్రిక్‌టన్నుల వరకు సామర్థ్యం గల గోదాములను ప్రాథమికంగా గుర్తించాం.

Updated Date - Sep 26 , 2026 | 12:49 AM