జగిత్యాల : జోరుగా జర్దా.. దందా
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:47 AM
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్దా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ప్రభుత్వఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జి
జగిత్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్దా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ప్రభుత్వఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలతో పాటు ప్రధాన పట్టణాలయిన కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి తదితర ప్రాంతాల్లో అక్రమ జర్దా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. జర్దాను చాలామంది ఆకు, సున్నం, వక్కతో పాటు దీన్ని వినియోగించడానికి అలవాటుపడ్డారు. పల్లె, పట్నం తేడాలేకుండా ప్రధానంగా మహిళలు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిదే కొందరు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. అధికారుల కళ్లుగప్పి దందా కొనసాగిస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వారికి కలిసొస్తోంది.
కిక్‌ను సొమ్ము చేసుకుంటూ..
జర్దా వినియోగానికి అలవాటుపడి మత్తులో తూగుతున్న వ్యక్తుల అవసరాలను ఆసరగా చేసుకొని పలువురు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పొగాకు సంబంధిత ఉత్పత్తి కావడంతో మన రాష్ట్రంలో జర్దా విక్రయాలపై నిషేదముంది. అయితే సుదీర్ఘకాలంగా చాలామంది అలవాటుపడి ఉండడంతో వినియోగాన్ని ఆపేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బ్లాక్‌లోనైనా కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. బాహాటంగా వీటిని విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు విని యోగదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. సరఫరా లేదంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఒక్కో డబ్బాను గరిష్ట ధరకు మించి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
యేటా సుమారు రూ.అరకోటికి పైగా వ్యాపారం..
జిల్లాలో జర్దా డబ్బాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 40గ్రాముల జర్దా డబ్బా ధర రూ.35నుంచి రూ.40 వరకు ఉంటుంది. దీనిపై 24శాతం జీఎస్టీ ఉంది. ఒక్కో డబ్బాను రూ.100నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనే ప్రతినెలా సగటున 20వేల డబ్బాలు విక్రయమవుతాయిని అంచనా ఉంది. ఈ లెక్కన బాహాటంగా ప్రతినెలా సుమారు రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు అదనంగా వ్యాపారులు సంపాదిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ లెక్కన యేడాది సుమారు రూ.అరకోటి పైగా అక్రమ వ్యాపారం సాగుతోంది. బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ సైతం ఎగ్గొడుతుండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా సుమారు 50మంది వరకు హోల్‌సేల్ వ్యాపారులు, వందల సంఖ్యలో చిల్లరవ్యాపారులు జర్ధ విక్రయాలు జరుపుతున్నట్లు అంచనా ఉంది.
జగిత్యాల కేంద్రంగా..
సాధారణంగా ఉత్తర్‌పదేశ్ నుంచి జర్దా ఎక్కువగా దిగుమతి అవుతుంటుందని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. కొందరు వ్యాపారులు ఇక్కడ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జీఎస్టీ చెల్లింపులేవీ లేకుండా దొడ్డిదారిన ఉత్తర్‌ప్రదేశ్ నుంచి జగిత్యాలకు వీటిని సరఫరా చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఇందుకోసం ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, కార్గోబస్సులు ట్రావెల్స్ బస్సులను వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన జర్దా డబ్బాలను జగిత్యాల నుంచి నిర్మల్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఆటోలు, ఇతరత్రా వాహనాల్లో ఎవరికీ అనుమానం రాకుండా కావాల్సిన వ్యాపారులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
దందాకు పెద్దల అండ...
జిల్లాలో కొనసాగుతున్న అక్రమ జర్దా దందాకు రాజకీయ పెద్దల అండదండలు అందుతున్నట్లు ప్రచారం ఉంది. రాజకీయ ముసుగులో అక్రమ వ్యాపారాలను కొనసాగించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. వ్యాపార సంబంధాలు కలిగియున్న పలువురు వ్యక్తులు రాజకీయ ముసుగును కప్పుకొని తమ దందాలను మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేలా వ్యవహరిస్తున్నారు. తాము నిర్వహించే గుట్కా, జర్దా, మద్యం, తినుబండారాలకు వినియోగించే నాసిరకం వస్తువులు, రేషన్‌బియ్యం క్రయవిక్రయాలకు పోలీసు, టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ తదితర సంబంధిత అధికారులు అడ్డురాకుండా ఉండడానికే రాజకీయ ముసుగు కప్పుకుంటున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పలువురు వ్యాపారులకు పెద్దల అండదండలు అందుతుండడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారన్న ప్రచారం ఉంది.
అంతంతమాత్రంగానే తనిఖీలు..
ప్రజారోగ్యంతో ముడిపడిన అంశాలే కావడంతో.. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు అనుమానాలకు తావిస్తోంది. కట్టుదిట్టంగా తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఈ తరహా వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోందనే విమర్శలొస్తున్నాయి. ఆహారభద్రత, తూనికలు, కొలతలు, పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ ఇలా వివిధశాఖల అధికారులు సోదాలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యాపారాలను అడ్డుకట్ట వేసే అవకాశమున్నా ఆ దిశగా పకడ్బందీ చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాలని వినియోగదారులు కోరుతున్నారు.