జగిత్యాల : కొలిక్కివచ్చిన కేవీ స్థల వివాదం
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:35 AM
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భోగ శ్రావణిప్రవీణ్‌ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్‌గల్ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.
జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ(కేవీ) స్థల కేటాయింపు వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భోగ శ్రావణిప్రవీణ్‌ల మధ్య జరిగిన పట్టు సడలింపుల ఫలితంగా, ప్రభుత్వం ఇటీవల చల్‌గల్ గ్రామంలో 5ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో వివాదం కొంతమేర సమసిపోయినట్లయింది.
వివాదం ఏమిటీ?
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గత సంవత్సరం అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భోగ శ్రావణి ప్రవీణ్‌ల మధ్య స్థలం ఎంపిక విషయంలో తీవ్రవిభేదాలు వచ్చాయి. సుమారు తొమ్మిది నెలల పాటు ఇరుపార్టీల నేతలు ఒకరిపైఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని చల్‌గల్‌లో స్థలం కేటాయించాలని బీజేపీ నియోజకవర్గ నాయకురాలు భోగ శ్రావణి ప్రవీణ్ డిమాండ్ చేశారు.
తొలుత 2 ఎకరాలు.. తర్వాత 5 ఎకరాల కేటాయింపు..
జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్ వాలంతరీకి చెందిన 2ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా వాలంతరీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు 10ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు 10 ఎకరాలు సరిపోదని, అరకొరగా కేటాయించడం ఏమిటనీ ఎంపీ అర్వింద్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ భోగ శ్రావణి ప్రవీణ్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు విమర్శిస్తూ ఆందోళనలు చేశారు. చల్‌గల్ వాలంతరీలో స్థలాన్ని కేటాయించాలని బీజేపీ నేత భోగ శ్రావణి ప్రవీణ్ నేతృత్వంలో కమలనాథులు పలు ఆందోళనలు, నిరసనలు చేశారు. ఒక దశలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాలలో నిరసన దీక్షకు సైతం ప్రయత్నించారు.
తాజా నిర్ణయం..
జగిత్యాల కేంద్రీయ విద్యాలయ స్థలకేటాయింపు వివాదానికి తెరదించుతూ, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జగిత్యాలరూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. శాశ్వత భవనం పూర్తయ్యేవరకు జిల్లా కేంద్రంలోని శ్రీరాంసాగర్ క్యాంపులో గల పాత ఎస్పీ కార్యాలయంలో కేవీ తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచామంటున్న బీజేపీ..
ప్రజాపోరాటం, ఉద్యమాలు చేసి ఎట్టకేలకు ప్రభుత్వమెడలు వంచి కేవీకి 5ఎకరాల స్థలం సాధించామని బీజేపీశ్రేణులు అంటున్నాయి. చల్‌గల్ వాలంతరీలో 5ఎకరాల భూమి కేటాయించడాన్ని బీజేపీ శ్రేణులు పార్టీ నాయకురాలు భోగ శ్రావణిప్రవీణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ విజయంగా అభివర్ణిస్తున్నారు. మొత్తం 10ఎకరాలు కేటాయించాల్సి ఉండగా, మొదటి దశలో 5 ఎకరాలు మాత్రమే కేటాయించడంపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ల మధ్య జరిగిన కేవీ రాజకీయ పోరు, స్థల వివాదంలో ఎట్టకేలకు పైచేయి ఎవరు సాధించారనే చర్చలు రాజకీయ వర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి.
ఎమ్మెల్యే సంజయ్‌దే కీలకపాత్ర అంటున్న కాంగ్రెస్..
కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్ వాలంతరీలో విలువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించ డంలో కీలకపాత్ర వహించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కే క్రెడిట్ దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఏదీఏమైనా కేంద్రీయ విద్యాలయ స్థల కేటాయింపు సమస్య కొలిక్కి వచ్చి ఈనెల 12వ తేదీన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడానికి కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్థల కేటాయింపునకు 8నెలలుగా కృషిచేస్తున్నా..
- డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్ వాలంతరీలో స్థల కేటాయింపు కోసం 8నెలలుగా కృషి చేస్తున్నాను. స్థల కేటాయింపు కోసం చేసిన ప్రయత్నాలు ఆధారాలతో సహా అందుబాటులో ఉన్నాయి. కొందరు ఇతర పార్టీల వారు తామే పోరాటం చేశామనడం హాస్యాస్పదం. అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి విభేదాలు లేవు. భవన నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి ఎంపీ అర్వింద్ చొరవ చూపాలి.
బీజేపీ పోరాటంతోనే స్థలం సాధించాం..
- డాక్టర్ భోగ శ్రావణిప్రవీణ్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, జగిత్యాల
బీజేపీ పోరాటంతోనే కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపు జరిగింది. ప్రస్తుతం 5ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మరో 5ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. స్థల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్వార్థ రాజకీయాలకు పాల్పడడం బాధాకరం. చల్‌గల్‌లో కాకుండా ఇతరప్రాంతాల్లో ఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేవీ విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.