సంబరాలకు వేళాయే...
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:45 PM
కళ కళలాడే రంగవల్లులు..., గొబ్బెమ్మలతో ముం గిళ్ళు... ఇంటింటా పిండివంటలు... ఆకాశన్నంటే గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేసే పిల్లలు, పెద్దల సందడి... ఇలా జిల్లాలోని పల్లెలు...పట్టణాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది.
కోల్‌సిటీటౌన్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కళ కళలాడే రంగవల్లులు..., గొబ్బెమ్మలతో ముం గిళ్ళు... ఇంటింటా పిండివంటలు... ఆకాశన్నంటే గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేసే పిల్లలు, పెద్దల సందడి... ఇలా జిల్లాలోని పల్లెలు...పట్టణాల్లో సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పల్లె వాతావరణంలో జరుగనున్నాయి. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగలు ప్రజలు జరుపుకోనున్నారు. ముంగిళ్ళల్లో రంగవల్లులను అందంగా తీర్చిదిద్దేందుకు పలు రకాల రంగులను కొనుగోలు చేశారు. అలాగే రంగులు, గొబ్బెమ్మలకు ఆవు పేడ, గరిక, రేగు పండ్లు, పిండిపూసలు, నవధ్యానాల అమ్మకాలు గోదావరిఖని ప్రధానచౌరస్తాలో జోరుగా సాగుతున్నాయి.
భోగభాగ్యాలతో మురిసేలా.. బోగి పండుగ
సంక్రాంతి పర్వదినంలో బోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజున విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామున భోగిమంటల్ని వేయడం సంప్రదాయంగా వస్తున్నది. అలాగే గోదాదేవి ధనుర్మాసం మొదటిరోజు నుంచి తిరుప్పావై పాశురాలతో రంగనాథుడ్ని ఆరాధించి భోగినాడే స్వామిని వివాహమాడి ఆయనలో లీనమవ్వడం వల్లే ఈ పండుగ వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే భోగినాడు ఆవుపిడకలపైన కొత్తబెల్లం, కొత్త బియ్యం ఆవుపాలతో పొంగిలిని వండి సూర్యభగవానుడికి నివేధించడం, సూర్యాస్తమయం అయ్యేలోగా అయిదు సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలకు భోగిపళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తుంది.
రేపు సంక్రాంతి...ఎల్లుండి కనుమ...
మకర సంక్రాంతి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నందున మకర సంక్రాంతిగా పిలుస్తారు. నేటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఏడాది మొత్తం చేసే ధానధర్మాలతో పోలిస్తే మకర సంక్రాంతి నాడు కూష్మాండం దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది శుభాలు చేకూరుస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే కనుమ రోజు పాడి పశువులకు ప్రాధాన్యమిస్తారు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలన్నదే కనుమ పండుగ అంతర్ధాం. కనుమ నాడు రైతన్నలు ముందుగా పశువులను శుభ్రం చేసి గోవుల్నీ, బసవన్నల్నీ కడిగి పూజలు చేస్తారు.
పారిశ్రామిక ప్రాంతంలో పల్లె పండుగ...
కోల్‌బెల్ట్ నేపథ్యమైనప్పటికి గామీణ ప్రాంతాల నుంచి గోదావరిఖనిలో నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పల్లె వాతావరణం కనిపిస్తుంటుంది. అంతేకాకుండా భోగి రోజున భోగి మంటలు వేయడం, పూజలు, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో కూడా పల్లె వాతావరణం సంతరించుకుంటుంది. పల్లెల నుంచి ఆవుపేడ, రేగుపండ్లు, గరికెలు, పిండిపూసలు, రంగులు, ఇతర పూజసామగ్రి కొనుగోళ్ళు చేస్తారు. మూడు రోజుల పండుగతో పల్లె వాతావరణంతో పారిశ్రామిక ప్రాంతం మురిసిపోతుంది.