మాస్టర్ ప్లాన్‌కు ఆమోదమెన్నడో..?
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:08 AM
భవిష్యత్తు అవసరాలు, నగర, పట్టణాల ప్రగతికి దిశానిర్దేశంగా నిలిచే మాస్టర్‌ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) అమలు విషయంలో జిల్లాలో నిరీక్షణ తప్పడం లేదు. సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉండడంతో సర్కారు నిర్ణయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. నానాటికి విస్తరిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల రూపురేఖలు మరింతగా మారడానికి ఇది అనివార్యం.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్/ కరీంనగర్ టౌన్)
భవిష్యత్తు అవసరాలు, నగర, పట్టణాల ప్రగతికి దిశానిర్దేశంగా నిలిచే మాస్టర్‌ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) అమలు విషయంలో జిల్లాలో నిరీక్షణ తప్పడం లేదు. సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉండడంతో సర్కారు నిర్ణయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. నానాటికి విస్తరిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల రూపురేఖలు మరింతగా మారడానికి ఇది అనివార్యం. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న కాలనీల దృష్ట్యా బల్దియాల స్వరూపాలు మారాల్సిన అవసరముంది. ఐదారేళ్లుగా దీని అమలు విషయంలో ’ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు’ అనే విధంగా యతారంగం వ్యవహరిస్తోంది. రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ధి ఆదేశాలతో స్పష్టమైన విధివిధానాల కల్పనకు గతంలోనే నడుం బిగించినప్పటికీ ఆమోదముద్రపడే విషయంలో విపరీతమైన ఆలస్యమవుతోంది.
మారనున్న రూపురేఖలు
సుడా (శాతవాహన అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు 62 గ్రామాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను 2041 నాటి అవసరాలకు తగినట్లుగా సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం గతేడాది పంపించారు. అన్నివర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్రమైన విధివిధానాలను ప్రణాళికలో పొందుపర్చారు. సుడాకు ఆదాయం రావడంతోపాటు భవిష్యత్తులో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పరంగా ప్రజలకు మేలైన నిర్ణయాల్ని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 622 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సుడా పరిధిలో 90 రోజుల గడువు ఇచ్చి ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించారు. సుడా చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు సహా నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా కమర్షియల్ ఏరియాను ప్రతిపాదించారు. సుడా పరిధిలో కొన్ని చోట్ల ఇండస్ర్టియల్ సెక్టార్, అర్బనైజేషన్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరీంనగర్‌లో 1998 నాటి ప్రణాళిక అమలవుతోంది. 1976లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌నే 1998లో సవరించారు. 40 ఏళ్లు గడిచినా అదే ప్లాన్ ఇంకా అమలువుతుంది. దీనికి అనుగుణంగానే నగరంలో అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 2041 అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త బృహత్తర ప్రణాళికకు ఆమోదం పొందితే అందుకనుగుణంగా నగరానికి, సుడా పరిధికి మహర్దశ రానుంది. భవన అనుమతులు, లేఅవుట్లు, రోడ్ల విస్తరణ, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల ఏర్పాటు సహా సమగ్రమైన అభివృద్ధి ఫలాలతో నగర రూపురేఖలు మారుతాయి.
మిగతా మున్సిపాలిటీల్లో...
హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోనూ దశాబ్దాల కిందటి మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. పట్టణాల్లో గతంతో పోలిస్తే జనాభా గణనీయంగా పెరిగింది. చొప్పదండి బల్దియాలో ప్రస్తుతం ఓ ఏజెన్సీ పర్యవేక్షణలో ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. హుజూరాబాద్, జమ్మికుంటలో ఇలాంటి ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇక్కడ మాస్టర్ ప్లాన్ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పలుమార్లు ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తామనే మాటలు ఆచరణకు నోచుకోలేదు. గత ప్రభుత్వ హయంలో ఒకేసారి ఈ మూడు బల్దియాలకు సంబంధించి ఓ ఏజెన్సీకి బాధ్యతల్ని అప్పగిస్తున్నారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత ఆ ముచ్చటే ఈ మున్సిపాలిటీల్లో వినిపించడం లేదు. రాబోయే అవసరాలకు తగిన విధంగా ఇక్కడ కూడా నివాస పారంతాలు, కమర్షియల్ జోన్లు, సెమీ కమర్షియల్, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, భవిష్యత్తు పట్టణ విస్తరణకు తగినట్లు కారిడార్ల ఏర్పాటుకు చొరవ చూపించాలి. ఇలా చేస్తేనే నగరంలో ఇప్పుడున్న మౌలిక వసతుల ఇక్కట్లు క్రమంగా దూరమయ్యే వీలుంది. మాస్టర్‌ప్లాన్ నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని ప్రజలు అంటున్నారు. ఆర్థిక భారం పడుతుందని కొందరు భావిస్తున్నారు. ఇంకొంతమంది అభివృద్ధికి ఇదో మంచి అవకాశమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భిన్నమైన అభిప్రాయాలున్నప్పటికీ భవిష్యత్తులో ప్రజల నివాసం, రవాణా, మౌలిక వసతులక కల్పన దిశగా మాత్రం ఈ బృహత్తర ప్రణాళిక అమలవ్వాల్సిందేననే మాట మెజారిటీ ప్రజల నుంచి వినిపిస్తోంది.