‘చేయూత’ అందేనా..?
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:01 AM
ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా దసరా నుంచి చేయూత పింఛన్లు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారైనా తమకు పింఛన్లు వస్తాయన్న గంపెడాశతో పలువురు దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వరకు ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
జగిత్యాల, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా దసరా నుంచి చేయూత పింఛన్లు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారైనా తమకు పింఛన్లు వస్తాయన్న గంపెడాశతో పలువురు దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వరకు ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 17,494 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 6,935 మంది వితంతువులు, 3,155 మంది దివ్యాంగులు, 3,099 మంది గీత కార్మికులు, 1,836 మంది ఒంటరి మహిళలు, 3,099 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు.
ఫజిల్లాలో ఇప్పటికే 2,13,754 మంది లబ్ధిదారులు
జిల్లాలో వివిధ రకాల పింఛన్లు లబ్ధిదారులు 2,13,754 మంది ఉన్నారు. వీరికి నెల నెలా రూ.46.20 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య పింఛను లబ్ధిదారులు 54,479 మంది, వితంతువులు 42,157 మంది, దివ్యాంగులు 15,512 మంది, గీతా కార్మికులు 3,232, చేనేత కార్మికులు 2,299, హెచ్‌ఐవీ బాధితులు 900 మంది, పైలేరియా బాధితులు 1,617 మంది, డయాలసిస్ బాధితులు 232 మంది, ఒంటరి మహిళలు 4,470 మంది, బీడీ వర్కర్లు 88,114 మంది, బీడీ టేకేదారులు 742 మంది లబ్ధిదారులు ఉన్నారు.
ఫ6 వేల పింఛన్ల తొలగింపు...
గత జూన్, జూలై మాసాల్లో పెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా జిల్లాలో మృతులు, అనర్హుల జాబితాలో ఉన్న 6 వేల మంది పింఛన్లను అధికారులు తొలగించారు. మరో 4,500 మంది వరకు స్థానికంగా లేకపోవడం, వేలిముద్రలు రాకపోవడం వంటి కారణాలున్నట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత 4,500 మంది వేలిముద్రలు, ఎఫ్‌ఆర్‌ఎస్, ఆధార్ వివరాలు మరోమారు సరిచూడడానికి డీఆర్‌డీవో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫపూర్తయిన పరిశీలన..
చేయూత పింఛన్ల కోసం లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన సెప్టెంబరు 30వ తేదీతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నియమించిన అధికార బృందాలు దరఖాస్తుదారుల వద్దకు నేరుగా వెళ్లి పరిశీలించారు. 14 ప్రశ్నలతో కూడిన వివరాలను సరిచూసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. చేయూత యాప్‌లో అర్హుడా..కాదా అన్న విషయాన్ని టిక్ చేసి లొకేషన్‌తో సహా అప్‌లోడ్ చేశారు. కాగా జిల్లాలో కొత్తగా పెద్దఎత్తున దరఖాస్తులు రావడంతో పరిశీలన తర్వాత ఎంతమందికి వస్తాయోనన్న విషయం వెల్లడించేందుకు మరింత సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మొటి దశ మాత్రమే పూర్తయిందని, ఇంకా రెండు విడతల్లో వడబోసిన తర్వాతనే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతుండడంపై చాలా మంది దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక
-రఘువరన్, డీఆర్‌డీవో
చేయూత దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం ఒక దశ పూర్తయింది. మరో రెండు దశల పరిశీలన తర్వాతనే అర్హుల జాబితా ప్రకటిస్తాము. దీనిపై అన్ని కోణాల్లో క్షుణంగా పరిశీలన జరుగుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము.
జిల్లాలో చేయూత దరఖాస్తులు ఇలా...
--------------------------------------------------------
మండలం...దరఖాస్తుల సంఖ్య
--------------------------------------------------------
బీర్‌పూర్ - 578
భీమారం - 434
బుగ్గారం - 458
ధర్మపురి - 970
ఎండపల్లి - 40
గొల్లపల్లి - 913
ఇబ్రహీంపట్నం - 459
జగిత్యాల రూరల్ - 884
జగిత్యాల - 126
కథలాపూర్ - 775
కొడిమ్యాల - 778
కోరుట్ల - 821
మల్లాపూర్ 0 945
మల్యాల - 989
మేడిపల్లి - 453
మెట్‌పల్లి - 737
పెగడపల్లి - 672
రాయికల్ - 918
సారంగాపూర్ - 458
వెల్గటూరు - 930
ధర్మపురి మున్సిపల్ - 211
జగిత్యాల మున్సిపల్ - 1,515
కోరుట్ల మున్సిపల్ - 1,098
మెట్‌పల్లి మున్సిపల్ - 887
రాయికల్ మున్సిపల్ - 415
మొత్తం - 17,494