Share News

రైతుభరోసా రెండు ఎకరాలకేనా..

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:09 AM

రైతుభరోసా, యూరియా సరఫరా విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్‌జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడారు.

 రైతుభరోసా రెండు ఎకరాలకేనా..

పెద్దపల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా, యూరియా సరఫరా విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్‌జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడారు. పెద్దపల్లి బస్టాండ్‌ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుభరోసా రెండెకరాలకే పరిమితమా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదగబోతుందని ఆమె పేర్కొన్నారు. నాలుగు రోజులుగా ’బాయిబాట‘లో భాగంగా చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గుగని కార్మికులను, ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రజల సమస్యలను విస్మరించి అక్రమ సంపాదనపై దృష్టి సారించారని ఆరోపించారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ఇసుక, మట్టి, బూడిద దందాలు పెరిగిపోయాయని, ప్రజా సమస్యలు పూర్తిగా పక్కన పడ్డాయని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. కల్లాల వద్ద వరి కుప్పలపై గుండె ఆగి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఏడు రకాల వడ్లకే బోనస్‌ పరిమితం చేసిందని విమర్శించారు. యాసంగి సీజన్‌లో రెండు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చారని, వానాకాలం రైతుభరోసా జూన్‌ 30న ఇస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. రైతుభరోసా అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. మేలో రావాల్సిన యూరియా ఇప్పటికీ రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. యూరియా కోసం ఇప్పుడు ఢిల్లీకి వెళ్తామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. సింగరేణిలో సుమారు రెండు వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా కేవలం కొద్దిమందికే ఉద్యోగాలు ఇస్తున్నారని కవిత అన్నారు. డిపెండెంట్‌ ఉద్యోగాలు, రైతుభరోసా వంటి అంశాలను ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి వాడుకుంటోందని ఆరోపించారు. సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించి, పెండింగ్‌ డిపెండెంట్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేననే రాజకీయ ప్రత్యామ్నాయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన, కార్మికులు, రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని, యువతకు తగిన స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 12:09 AM