ప్రజాక్షేత్రంలోకి ప్రభుత్వం..
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:21 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన.. ప్రగతి నివేదన అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన.. ప్రగతి నివేదన అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఏప్రిల్ 16 తేదీన ఒకేరోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభ లను, మే రెండో తేదీన నియోజకవర్గ స్థాయిలో ఒకేరోజు, మే 22 వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పది అంశాలపై దృష్టి సారించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళ క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, అరైవ్ ఆలైవ్, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడం, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం, తదితర అంశాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ, పట్టణ సభలను నిర్వహించి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజల నుంచి దర ఖాస్తులను స్వీకరించింది. అనంతరం సరిగ్గా రెండేళ్లు గడిచిన తర్వాత మరోసారి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించినట్లుగా తెలుస్తున్నది.
మొదటి దశలో కొన్ని పథకాలే అమలు
మొదటి దశలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, పట్టణ సభలో ఏవైతే అమలు చేయాల్సిన పథకాల గురించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందో వారి అర్హత ఆధారంగా పథకాలను అమలు చేసింది. కానీ ఆ తర్వాత దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఇప్పుడు నిర్వహించే కార్యక్రమాల ద్వారా అవకాశం లభిస్తుందని ఆశతో ఉన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారం లోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో భాగంగా కేవలం కొన్ని పథకాలనే అమలు చేసింది. కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఆ తర్వాత ఎంత మంది దరఖాస్తు చేసుకున్న కూడా లబ్ధి చేకూరలేదు.
సంక్షేమ పథకాలతో కొందరికే లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీల్లో అమలు చేస్తున్న పథకాల్లో కొందరికి లబ్ధి చేకూరుతున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో రాష్ట్ర మంతటా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆ పథకం అమలులో ఉంది. అదే పథకం ద్వారా ప్రతీ నెలా మహిళ లకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. గృహలక్ష్మీ పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే విషయంలో 1,34,896 గృహాల వినియోగదారులకు ఇప్పటివరకు 115 కోట్ల 17 లక్షల రూపాయల వరకు చెల్లించారు. కానీ ఈ పథకం ద్వారా మరికొన్ని కుటుంబాలకు ప్రయో జనం చేకూరే అవకాశాలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాగే 500 రూపాయలకే సబ్సిడీ వంట గ్యాస్ 1,18,901 కుటుంబాలకు 14 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చగా, ఇంకా అర్హులైన వారికి అవకాశాన్ని ఇవ్వడం లేదు. రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్లో ఎకరానికి 7500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్న హామీ మేరకు కేవలం అసంపూ ర్ణంగానే ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతులకు సాయా న్ని అందించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు ఇస్తామన్న రైతు భరోసాకు ఇప్పటివరకు దిక్కులేదు. కౌలు రైతులకు సైతం పెట్టు బడి సాయం అందిస్తామన్న హామీ ఇప్పటివరకు నెరవేరక పోగా, వ్యవసాయ కూలీలకు ఒక్కసారి మాత్రమే సాయాన్ని అందించిన ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీ మేరకు జిల్లాలో 58,278 మంది రైతులకు 436 కోట్ల 68 లక్ష రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీకి దూరమైన రైతులకు డబ్బులను ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 6310 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయగా అవి ప్రగతిలో ఉన్నాయి. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు ఇస్తున్న రూ.2016 పింఛను రూ.4 వేలకు, దివ్యాంగులకు ఇస్తున్న రూ.3016 పింఛన్‌ను రూ.6 వేలకు ఇప్పటివరకు పెంచలేదు. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం జిల్లాలో 28,546 కొత్తకార్డులు ఇచ్చి 56,476 మందికి ప్రయోగం చేకూర్చింది. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేసింది. గతంలో బకాయి ఉన్న 14 కోట్ల 66 లక్షల రూపాయల వడ్డీ సొమ్మును మహిళల ఖాతాలో జమ చేసింది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సహాయంతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నెరవేర లేదు. ప్రస్తుతం నిర్వహించే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా ప్రజల నుంచి ఆయా పథకాల ద్వారా లబ్ధి పొం దేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విజ్ఞప్తులు రానున్నాయి.