పేదలకు ధీమా.. ‘ఇందిరమ్మ’ బీమా
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:53 PM
రాష్ట్రంలోని పేద, నిరుపేద వర్గాలకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వచ్చే జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకవస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఈ పథకం ద్వారా 2.48 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించ నున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలోని పేద, నిరుపేద వర్గాలకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వచ్చే జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకవస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఈ పథకం ద్వారా 2.48 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించ నున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బీమా పథకం మాదిరిగా దీనిని అమలు చేయను న్నారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద ప్రమా దవశాత్తు గానీ, అనారోగ్య కారణాల వల్ల గానీ మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథ కాన్ని తీసుక వస్తున్నది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 4 వేల కోట్ల రూపా యలను కేటాయించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వం ప్రక టించింది. ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టివిక్రమార్క 3,24,234 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడంతో పాటు నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే ఒకటవ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు అల్పాహారం తో పాటు ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని, ఉద్యోగు లకు నగదు రహిత ఆరోగ్య సేవలు, 1.2 కోట్ల రూపాయల వరకు ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 లక్షల రేషన్ కార్డులు కలిగిన యజమానులకు జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఆహార భద్రత కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన కార్డులు మొత్తం 2,48,255 రేషన్ కార్డులు అమ ల్లో ఉన్నాయి. వీటిపై 6.88 లక్షల మందికి ఒక్కొ క్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అర్హతగా పేర్కొనడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇందిరమ్మ జీవిత పథకాన్ని కూడా రేషన్ కార్డులు కలిగిన కుటుంబ పెద్దలకే వర్తింపజేస్తామని ప్రకటించింది. అయితే చాలా రేషన్ కార్డులను గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మహిళల పేరిటనే జారీ చేసింది. కార్డులపై కుటుంబ పెద్దలుగా ఉన్న మహిళలకే జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తారా, కుటుం బ పెద్దలుగా ఉన్న పురుషులకు వర్తింపజేస్తారా, రేషన్ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ గ్రూప్ ఇన్స్‌రెన్స్ చేస్తారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. రైతు బీమా పథకం వలే దీనిని అమలు చేయను న్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతు లందరికీ యేటా ప్రభుత్వం జూలైలో 5 లక్షల రూపాయల వరకు బీమా వర్తించేందుకు వీలుగా ప్రీమియం చెల్లిస్తున్నది. ప్రమాదవ శాత్తు గానీ, అనారోగ్య కారణంగా గానీ మరణిం చినట్లయితే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్మును చెల్లిస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉండనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు బీమా పథకాలను బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు కలిగిన వారికి వర్తింపజేస్తు న్నది. సాధారణ బీమాకు 12 రూపాయలు, ప్రమాద బీమాకు 320 రూపాయలకు పైగా ఖాతాదారులు యేటా చెల్లించాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతాల నుంచి ఆ ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటు న్నారు. సాధారణ బీమా పథకం ద్వారా ఖాతా దారుడు సాధారణ మరణం పొందినా, మరే రకంగా మృతి చెందినా 2 లక్షల రూపాయలు అ కుటుంబానికి అందజేస్తున్నారు. రెండు బీమా పథకాల్లో సభ్యులై ఉంటే ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే సాధారణ బీమా కింద 2 లక్షలు, ప్రమాద బీమా కింద మరో 2 లక్షలు, మొత్తం 4లక్షల రూపాయలు అందను న్నాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుక రానున్న ఇందిరమ్మ జీవిత బీమా ఆయా కుటుంబాలకు మరింత భరోసా ఇవ్వనున్నది.