Share News

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 15 , 2026 | 11:40 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల అమలు మరింత మెరుగు పడాలన్నారు. రాబోయే 25 రోజుల్లో కూలీల హాజరు గణనీయంగా పెంచాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి

పెద్దపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధిహామీ పనుల అమలు మరింత మెరుగు పడాలన్నారు. రాబోయే 25 రోజుల్లో కూలీల హాజరు గణనీయంగా పెంచాలన్నారు. ఎంపీడీవోలు ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నెలాఖరు వరకు ఎక్కువ మంది కూలీలను సమీకరిస్తే అదనంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీ మండలంలో కనీసం 200 మంది కార్మికులతో పనులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 5:50 నుంచి 6:50 గంటల మధ్య కూలీలు పనులకు వచ్చేలా మొబిలైజేషన్‌ చేయాలన్నారు. కూలీలు 305 రూపాయల పొందేలా చూడాలన్నారు. చేసిన పనికి ఎన్ని డబ్బులు వస్తాయో అదే రోజు తెలియజేయాలన్నారు. ముత్తారం, జూలపల్లి, శ్రీరాంపూర్‌ మండలాల్లో పాడైపోయిన కాలువల పూడికతీత పనులను ప్రాధాన్యతతో చేపట్టి సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రస్తుతం 600 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, గ్రౌండింగ్‌ పూర్తి చేసిన ప్రతి ఇంటికి 5 రోజుల్లోపు ఆర్డర్లు జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 10 నుంచి 15 ఇళ్లకు గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎల్‌ 3 నుంచి ఎల్‌ 1కు మార్పుల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జడ్పీ సీఈఓ నరేందర్‌, హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌, ఎంపీడీవోలు, పీఆర్‌ ఈఈ, హౌసింగ్‌ ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:40 PM