ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:37 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లి, దేవునిపల్లి, అప్పన్నపేట, గోపయ్యపల్లి, కనగర్తి గ్రామాల్లో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చివరి దశకు రాగా పీడీ పరిశీలించి నిర్మాణ పనులు నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలన్నారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లి, దేవునిపల్లి, అప్పన్నపేట, గోపయ్యపల్లి, కనగర్తి గ్రామాల్లో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చివరి దశకు రాగా పీడీ పరిశీలించి నిర్మాణ పనులు నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి సూచనలు, సలహాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించిన దృష్ట్యా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇంటి పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు వెంటనే చివరి బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తయ్యేలా నిత్యం గృహనిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. హౌసింగ్ డీఈ పరమా చారి, ఏఈ రహమాన్, పంచాయితీ కార్యదర్శులు, లబ్దిదారులు పాల్గొన్నారు.