ఆదాయం ఫుల్.. చెల్లింపులు నిల్...
ABN , Publish Date - May 16 , 2026 | 11:54 PM
జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు.
(ఆంఽధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, కమాన్‌పూర్, మంథని, రామగుండలలో మార్కెట్ యార్డులు ఉండగా, కొత్తగా ఎలిగేడు మార్కెట్ అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి, మంథని మార్కెట్లకు సొంత భవనాలు, యార్డులు ఉండగా, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, ఎలిగేడు మార్కెట్లకు సొంత భవనాలు, యార్డులు లేవు. మార్కెట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్వహణ బిల్లులు విడుదల కాక ఆరు మాసాలు గడుస్తున్నది. అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బిల్లులు, రోజువారీ కూలీల బిల్లులు, మార్కెట్ యార్డుల క్లీనింగ్, తాగునీటి సరఫరా బిల్లులు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు గాను స్కావెంజర్లకు ఇచ్చే బిల్లులు కూడా ఇవ్వక పోవ డంతో వాళ్లు పనులకు రావడం లేదని అంటున్నారు. దీంతో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. మార్కెట్లను సక్రమంగా క్లీనింగ్ చేయడం లేదు. అద్దె భవనాల యజమానులు తాళాలు వేస్తామని చెబుతుండడంతో మార్కెట్ యార్డుల కార్యదర్శులు బిల్లులు త్వరలోనే వస్తాయంటూ వారికి సర్ది చెబుతూ వస్తున్నారు. కొందరు కార్యదర్శులు అప్పులు తీసుకవచ్చి మార్కెట్లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంట చేతికి వస్తుండడంతో మార్కెట్లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం, మక్కలు తీసుక వస్తున్నారు. అక్కడ సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్‌లో రూ. 30 లక్షల బిల్లులు..
జిల్లా వ్యాప్తంగా 30 లక్షల రూపాయలకు పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయని, మార్కెట్ పాలక వర్గాల చైర్మన్లకు ఇచ్చే వేతనాలు కూడా రావడం లేదని చెబుతున్నారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా ఇప్పటివరకు పెండింగులో ఉన్న బిల్లులు రాలేదని అంటున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, వివిధ రకాల పంట ఉత్పత్తులు, మామిడి, నిమ్మ, జామ, తదితర పండ్ల తోటల ఉత్పత్తుల ద్వారా మార్కె ట్లకు ఒక శాతం మార్కెట్ ఫీజు, ట్రేడర్లు, అడ్తిదారులకు జారీ చేసే లైసెన్సులు, రెన్యూవల్స్ ద్వారా యేటా ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతున్నది. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటి నిర్వహణకు బిల్లులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఆయా మార్కెట్ల ద్వారా సమకూరే ఆదాయం మార్కెట్ల ఖాతాల్లోనే జమ చేసే వాళ్లు. మార్కెట్ల నిర్వహణకు, రైతులు మార్కెట్లకు వచ్చేందుకు రహదారుల నిర్మాణానికి, మార్కెట్ యార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ అనుమతి తీసుకుని వెచ్చించే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల చైర్మన్ పదవులకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు తీసుక వచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా 2016-17 నుంచి మార్కెట్లకు ఫీజులు, పన్నుల రూపేణా జమ అయ్యే ఆదాయం అంతా నేరుగా ప్రభుత్వ ఖాతాకు చేరే విధంగా చర్యలు చేపట్టింది. పాలకవర్గాలు గానీ, మార్కెటింగ్ శాఖాధికారులు మార్కెట్ల నిర్వహణకు నేరుగా నిధులు డ్రా చేసుకునే పరిస్థితి లేదు. నెలనెలా బిల్లులు ప్రభుత్వానికి పంపిస్తే, పైనుంచే నిధులు విడుదల చేస్తారు. గతంలో ఎన్నడూలేని విఽధంగా ఐదు మాసాలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో మార్కెట్ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్ల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగు బిల్లులను విడుదల చేయాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.