Share News

రెండున్నరేళ్లలో అదనంగా రూ. 16,479 కోట్లు వెచ్చించాం..

ABN , Publish Date - May 28 , 2026 | 11:45 PM

కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా గడిచిన రెండున్నరేళ్లలో అదనంగా 16,479 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

రెండున్నరేళ్లలో అదనంగా   రూ. 16,479 కోట్లు వెచ్చించాం..

పెద్దపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా గడిచిన రెండున్నరేళ్లలో అదనంగా 16,479 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో గల పెద్దకల్వలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 వేల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. మరో 15 లక్షల నుంచి 18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, వర్షానికి తడిసిన 9 టన్నుల ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం మాత్రం 51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతించిందన్నారు. అయినా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మాది రైతుల పక్షపాత ప్రభుత్వమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదని, కానీ ఆ పార్టీ నేతలు కొనుగోలు కేంద్రాలు తిరగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండున్నరేళ్లలో రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న పంట దిగుబడులు వచ్చాయన్నారు. ఆ పంటను అంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. తాలు, తరుగు పేరిట కోతలు పెడితే కఠిన చర్యలు తప్పవని రైస్‌ మిల్లర్లను హెచ్చరించామన్నారు. ఎక్కడైనా లారీల కొరత ఉంటే నాలుగైదు రోజుల పాటు ఇసుక లారీలను వాడుకోవాలని, ఇందుకు పోలీస్‌ యంత్రాంగం సహకరించాలని మంత్రి ఆదేశించారు.

రైతులు ఆధైర్య పడవద్దు..

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

వడ్లు, మక్కల కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్య పడవద్దని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మిమ్మల్ని అఽధైర్యపడేలా చేస్తున్నాయని, రెండు సీజన్లకు సరిపడా సాగు నీటిని అందించడం వల్లనే ఈ సీజన్‌లో పంట దిగుబడులు బాగా వచ్చాయన్నారు. గోదాములు నిండి పోవడంతో ప్రైవేట్‌ గోదాములను కిరాయికి తీసుకుని ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని, చివరి గింజ వరకు ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామన్నారు. హామాలీలు బాగా పని చేస్తున్నారని, మరొక వారం రోజులపాటు మరింత కష్టపడితే కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈ యాత్ర ఆ యాత్ర అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. ప్రతిపక్షాలకు ఏమి చేయాలో అర్థం కాక విషం కక్కుతున్నారని అన్నారు. మీ దీవెనలతో మరోసారి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

రైతులు బాగుంటే ప్రతిపక్ష నేతలు గోస పడుతున్నారు.

- ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు

రైతులు బాగుంటే ప్రతిపక్ష నాయకులు కల్లాలు, కొనుగోలు కేంద్రాలు తిరుగుతూ గోస పడుతున్నారని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ఎద్దేవా చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వారిని కాపాడుకుంటున్నామని అన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున ధాన్యం పెద్దపల్లికి వస్తోందని, జిల్లాలో ఉన్న ధాన్యాన్ని ఆయా మిల్లుల్లో దించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు జరపాలన్నారు. ఆయా మిల్లుల్లో 300 లారీలు దాటిన తర్వాతనే ఇతర జిల్లాల ధాన్యాన్ని దించుకోవాలని సూచించారు. మిల్లర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్లు కోయ శ్రీహర్ష, రాహుల్‌ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, రామగుండం కార్పొరేషన్‌ చైర్మన్‌ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ల మల్లయ్య, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కూర మల్లారెడ్డి, మినుపాల ప్రకాష్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:45 PM