Share News

వెయ్యి రోజుల పాలనలలో రోజు మోసమే

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:33 AM

వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ రోజూ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్‌ రోజు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెయ్యి రోజుల పాలనలలో రోజు మోసమే

ధర్మారం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ రోజూ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్‌ రోజు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే కేసీఆర్‌ అప్పు చేశాడని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడని, కేసీఆర్‌ అప్పు చేసింది రాష్ట్ర బాగుకోసమేనని తెలిపారు. ఆరు గ్యారంటీల అబద్దపు వాగ్దానాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, యాప్‌ల ద్వార యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నెలకు 2500 భృతిని ఇస్తానని చెప్పి మహిళలకు, 2 వేలు ఫించన్‌ పెంచుతానని చెప్పి వృద్ధులకు బాకీ పడ్డారని, వారి బాకీని ఎప్పుడు చెల్లిస్తారో రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వికలాంగులు 6 వేల పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారని, దివ్యాంగులపై కూడా ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు జాలి, దయ లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పుట్టిన పాప నుండి చనిపోయే వృద్దుల వరకు కేసీఆర్‌ పథకాల రూపకల్పన చేశారని గుర్తు చేశారు. వాటిని అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందని పేర్కొన్నారు. రైతుబంధుకు రాంరాం చెప్పారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో వెలుగు వెలిగిన గురుకులాలు నేడు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల ప్రభుత్వ పాఠశాలను మూసివేశారని, ఈయేడు ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష 28 వేల అడ్మిషన్లు తగ్గడం దేనికి సంకేతమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధర్మపురి నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం వంటావార్పులో మాజీ మంత్రి కొప్పులతో పాటు నాయకులు, కార్యకర్తలు భోజనం చేశారు.

నేనడిగిన ప్రశ్నలపై మంత్రి ప్రోగ్రెస్‌ రిపోర్డ్‌ ఇవ్వాలి

తాను చేసిన అభివృద్ధిపై నాకు వాట్సప్‌లో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ పంపిస్తానని చెప్పుకుంటున్న మంత్రి అడ్లూరి, నేను అడిగిన అంశాలపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ పంపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. పత్తిపాక రిజర్వాయర్‌ అవసరం లేదని నిపుణులు చెప్పినప్పటికి, కట్టి తీరుతానని చెప్పుకుంటున్న మంత్రి, ఇప్పటి వరకు ఎందుకు పనులు చేపట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. తుమ్మడిహెట్టి నిర్మిస్తామని ముఖ్యమంత్రి, పత్తిపాక కట్టి తీరుతానని అడ్లూరి అగమవుతున్నారని విమర్శించారు. ఎండపల్లి, వెల్గటూర్‌ మండలాల ప్రజల పంటలకు నీళ్లు అందించేందుకు లింక్‌ కెనాల్‌కు నిధులు మంజూరు చేసి 90 శాతం పనులు పూర్తి చేస్తే, ఇప్పటివరకు ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చేప్పాలని కోరారు. పత్తిపాక రిజర్వాయర్‌, మేడారం లింక్‌ కెనాల్‌, మ్యాదర్‌గండి చెరువుపై లక్ష్మణ్‌కుమార్‌ తనకు ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ పంపించి తాను చేసిన అభివృద్ధిని నిరూపించుకోవాలన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:33 AM